కరోనా దానికదే పోతుంది.. వచ్చేవారం నుంచి దేశీయ ప్రయాణాలకు అనుమతి: ట్రంప్

0
578

అమెరికాలో కరోనా పరిస్థితులు కుదుటపడనప్పటికీ వచ్చే వారం నుంచి దేశీయ ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్టు వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కరోనా కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, భారీ ర్యాలీలకు సైతం అనుమతి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం.

అలాగే, వచ్చేవారం తొలిసారిగా వాషింగ్టన్ వదిలి అరిజోనా పర్యటనకు ట్రంప్ వెళ్లనున్నారు. అయితే, ఈ పర్యటనలో రాజకీయ పరమైన ఉద్దేశం లేదని, ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం చేయడానికేనని ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా 25 వేల మందితో భారీ సభలు నిర్వహిస్తానని వివరించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎంతో కీలకమైన ఒహాయో రాష్ట్రంలోనూ పర్యటిస్తానని తెలిపారు.

కరోనా విషయంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మహమ్మారి దానికదే పోతుందని, వ్యాక్సిన్‌పై ఆధారపడడం లేదని అన్నారు. త్వరలోనే వైరస్ నశిస్తుందన్నారు. అయితే, అప్పటి వరకు అందరూ ఓపిగ్గా ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్థిక రంగం త్వరలోనే కుదుటపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply