నమ్మకంగా పిలిచి.. హతమార్చి..

0
655

కోనేరుసెంటర్‌ (మచిలీపట్నం): ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. ప్రియురాలితో మాట్లాడేందుకు అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడు తన ప్రియురాలి అన్నను హతమార్చిన ఘటన మచిలీపట్నంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

మచిలీపట్నం అమృతపురం జెండాసెంటర్‌కు చెందిన యర్రంశెట్టి సాయి (21) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్‌ యాసిన్‌లు స్నేహితులు. యాసిన్‌ పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. సయ్యద్‌ యాసిన్‌ సాయి కోసం ప్రతిరోజు ఇంటికి వెళుతుంటాడు. అలా యాసిన్‌ సాయి సోదరిని ప్రేమలోకి దింపాడు. విషయం తెలిసిన సాయి యాసిన్‌ను తన చెల్లెలితో తిరగవద్దని, మాట్లాడవద్దని పలుమార్లు హెచ్చరించినా మానలేదు. ఈ విషయమై ఇరువురి మధ్యా పలుమార్లు గొడవలు, కొట్లాటలూ జరిగాయి.

తన ప్రేమ వ్యవహారానికి సాయి అడ్డు వస్తున్నాడని పగ పెంచుకున్న సయ్యద్‌ యాసిన్‌ మంగళవారంమధ్యాహ్నం సాయిని పార్టీ పేరుతో ఆంధ్ర జాతీయ కళాశాల వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఆహ్వానించాడు. అక్కడ ఇరువురూ కలసి మద్యం సేవిస్తుండగా పథకం ప్రకారం యాసిన్‌ సాయి గ్లాసులో సైనెడ్‌ను కలిపి సాయికి ఇచ్చాడు. విషయం తెలియని సాయి మందును సేవించి కొద్దిసేపటికి అపస్మారకస్థితికి చేరుకుంటుండగా యాసిన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా విషయాన్ని గ్రహించిన స్థానికులు ఎండ దెబ్బకు నీరసంపడి ఉంటాడని భావించారు. సమీపంలోని ఆటోలో వైద్యం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా సాయి మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. సాయి తల్లి ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

Leave a Reply