రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసిన అమిత్ షా లాక్ డౌన్ మీద ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన లాక్ డౌన్ మీద రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. లాక్ డౌన్‌ను పొడిగిద్దామా? వద్దా? అని రాష్ట్రాల ముఖ్యమంత్రులను అమిత్ షా సమాచారం కోరినట్టు తెలిసింది. కేంద్ర ప్రకటించిన లాక్ డౌన్ 4 మే 31వ తేదీతో ముగుస్తుంది. అందుకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో కేంద్రం మరోసారి లాక్ డౌన్‌ను పొడిగిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా స్వయంగా సీఎంలకు ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు లాక్ డౌన్ పొడిగింపు, మినహాయింపుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా కేంద్రం ఒంటెత్తుపోకడకు పోతుందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో నేరుగా అమిత్ షా రంగంలోకి దిగి ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మరోవైపు హోంశాఖ సెక్రటరీ ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో మాట్లాడారు. లాక్ డౌన్ 4 నిబంధనలు, అమలవుతున్న తీరు, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
