*విజయవాడ హెల్త్ యూనివర్శిటీ*
*కృష్ణాజిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 8 నమోదయ్యాయి. ఈ కేసులన్నీ విజయవాడలోనే వెలుగుచూశాయి. కృష్ణలంకలో 3, వన్‌టౌన్‌లో 2, రామలింగేశ్వరనగర్, సింగ్‌నగర్, వైఎస్‌ఆర్ కాలనీల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం కోవిడ్ కంట్రోల్ సెంటర్ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం…ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 505 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 337 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 146 ఉన్నాయి. 22 మంది జిల్లాలో కరోనా కారణంగా మృతి చెందారు. శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో ఇద్దరు చనిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆ ఇద్దరూ విజయవాడ నగరానికి చెందిన వారే*.
: *ఇప్పటికే జిల్లాలో 500లకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 480 కేసులు విజయవాడ నగరంలోనే ఉన్నాయి. వీటిలో కృష్ణలంక ప్రాంతంలో 160 కేసులు, కార్మికనగర్‌లో 120 కేసులు ఉన్నాయి. మిగిలినవవి చిట్టినగర్, వైఎస్‌ఆర్ కాలనీ, ఒన్‌టౌన్, కెఎల్‌రావు నగర్, భవానీపురం, పెనమలూరు, కానూరు, పటమట, గాయత్రినగర్, మొగల్‌రాజపురం తదితర ప్రాంతాల్లో నమోదయ్యాయి.*
*పెరుగుతున్న మరణాలు*
*కరోనా పాజిటివ్ కారణంగా చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య గత నాలుగు రోజుల్లో పెరుగుతూ వస్తోంది. దీంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ సెంటర్ నాలుగు రోజుల నుండి విడుదల చేస్తున్న బులెటిన్‌ను పరిశీలిస్తే…గత మూడు రోజుల్లో ఒక్కో మరణం సంభవించగా, ఉండగా, శుక్రవారం రెండు మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్యను రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే కర్నూలు జిల్లా తరువాత కృష్ణాలో అధికంగా ఉన్నాయి. అందులోనూ విజయవాడ నగరంలోనే ప్రధానంగా మరణాలు ఉండటంతో నగర వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.*
*పరీక్షల సామర్థ్యం పెంపు*
*ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుతో నగరంలో సాధారణ పరిస్థితి ఏర్పడుతున్నా కేసుల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారు. అనేక మంది సాధారణ జాగ్రత్తలు కూడా పాటించడంలేదు. మాస్కులు ధరించడంలేదు. భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వైద్య పరీక్షలను విస్తృతంగా నిర్వహించేందుకుగాను వైద్య బృందాలను పెంచినట్లు వైద్యాధికారులు తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ప్రభుత్వాస్పత్రితోపాటు పలు ప్రాంతాల్లో వైద్య పరీక్షలకు శిబిరాలను ఏర్పాటుచేశారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ తమకు దగ్గరగా ఉన్న వైద్య శిబిరం వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.*
