సాహితీ మణిదీపం మల్లాది రామకృష్ణశాస్త్రి…

0
1335

మల్లాది రామకృష్ణశాస్త్రి 1905, జూన్ 17న కృష్ణా జిల్లా, చిట్టిగూడూరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో కనకవల్లి, నరసింహశాస్త్రి దంపతులకు జన్మించాడు. ఈయన మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివాడు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నాడు. నలభైకి పైగా భాషలను అభ్యసించి అనేక శాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించాడు. ఈయన వేద విద్యను యడవల్లి సుబ్బావధాన్లు వద్ద, మహాభాష్యాన్ని నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద, బ్రహ్మసూత్రాలను శిష్ట్లా నరసింహశాస్త్రి వద్ద నేర్చుకున్నాడు. నాట్యం, చిత్రలేఖనం, సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. ఆస్తి లావాదేవీలలో సంపదను అంతా పోగొట్టుకుని బందరు వదిలి కొంతకాలం గుంటూరులో ఉన్నాడు.ఈయనకు 15వ యేట పురాణం సూరిశాస్త్రి కుమార్తె వెంకటరమణతో వివాహం జరిగింది. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతడు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు.ఈయన సినిమాలలో మాటలు, పాటలు రాయడానికి ముందు, పలు పత్రికల్లో వ్యాసాలు, కథలు వ్రాశాడు. నవలలు, నాటకాలు రాసి పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ చిత్ర రచన విషయంలో సలహాల కోసం 1945లో ఇతడిని మద్రాసుకు ఆహ్వానించాడు. ఆ విధంగా ఈయన 1945, మార్చి 24న మద్రాసులో అడుగుపెట్టాడు. మద్రాసులోని పానగల్ పార్కులో పగలంతా ఒక చెట్టు క్రింద ఉండే రాతిబల్లపై కూర్చుని వచ్చినవారికి మదనశాస్త్రం నుండి మంత్రశాస్త్రం వరకు బోధించేవాడు. ఎంతో మంది వర్ధమాన కవులకు సందేహ నివృత్తి చేసేవాడు. మద్రాసులో సముద్రాల రాఘవాచార్యకు అత్యంత ఆప్తుడయ్యాడు. అతడికి చాలా కాలం “ఘోస్ట్ రైటర్”గా ఉన్నాడు. 1952 వరకు ఇతడు చేసిన సినిమా రచనలలో ఇతని పేరు లేకపోవడం గమనార్హం. చిన్న కోడలు చిత్రంతో ఇతడు అజ్ఞాత వాసం వదిలి బహిరంగంగా సినీజీవితం కొనసాగించాడు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రచించాడు.

ఈయన కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం వ్రాశాడు. కృష్ణాపత్రికలో చలువ మిరియాలు పేరుతో వ్యంగ్య వ్యాసాలను వ్రాశాడు. 19వ యేట నుండే కథారచన ప్రారంభించి సుమారు 125 కథలను వ్రాశాడు. ఈయన వ్రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదించబడింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశాడు.

Leave a Reply