శ్రీ గబ్బిట బాల సుందర శాస్త్రి 1895 జులై 2న కృష్ణా జిల్లా మచిలీపట్నం లో శ్రీ గబ్బిట గురునాధం శ్రీమతి వేదాంతి సుబ్బమ్మ దంపతులకు జన్మించారు .25 ఏళ్ళ వయసులో 1920 లో గాంధీజీ పిలుపు అందుకుని చదువుతున్న బి.ఏ .డిగ్రీ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉత్సాహం ఉరకలు వేసి భారత స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొన్నారు .తర్వాత ఆయన దృష్టి నాటక కళపై పడింది .బందరు అంటే ఆనాడు నాటకాలకు పోతుగడ్డ .ఆ ప్రభావం తో నాటకాలు ఆడారు .బందరు లోని ‘’ఇండియన్ డ్రమటిక్ కంపెనీ ‘’లో చేరి ముఖ్య పాత్ర ధారిగా రాణించి ప్రశంసలు అందుకున్నారు .నటులకు తమ విశేష నటనానుభవం తో క్రమశిక్షణతో శిక్షణ నిచ్చి ఎందరెందరినో ఉత్తమ నటులుగా తీర్చి దిద్దారు .దీనితో పాటు ఆధ్యాత్మిక చింతనా బలీయమైంది .కనుక జీవన విధానం లో ఎక్కడా తప్పటడుగులు పడలేదు .సవ్యంగా జీవితం, నట జీవితం సాగి పోయాయి . గబ్బిట శాస్త్రి గారు నాటకాలలో చిరస్మరణీయ పాత్రలు ధరించి కీర్తి సాధించారు .సత్య హరిశ్చంద్ర నాటకం లో విశ్వామిత్ర పాత్ర లో వారి నటనా వైదుష్యం చిరస్మరణీయం అంటారు .ఆంగ్లనాటకం ‘’ఒథెల్లో’’లో చక్కని వాచికం అభినయం తో అచ్చంగా ఆంగ్ల నటుడు నటించినట్లు నటించి సుభాష్ అని పించుకున్నారట .పౌరాణిక నాటకాలలో ధర్మరాజు ,దుర్యోధనుడు ,కంసుడు ,ఆంజనేయుడు ,సుదర్శన చక్రవర్తి ,కలి,సుదేవుడు గా పాత్రలు ధరించి మెప్పించారు .చారిత్రాత్మక నాటకాల లో రామరాజు ,ఔరంగ జేబు ,పెద్దన గా నటించారు .సా౦ఘిక నాటకాలలో గిరీశం ,శతమిత్రుడు ,స్వామి నాధం వంటి పాత్రలలో జీవించారు .పాత్రలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి .వచ్చినవాటికి తన నటనా వైదుష్యం తో న్యాయం చేకూర్చి చిరకీర్తి నార్జించారు .నాటక రంగానికి యెనలేని సేవలు అందించి తాను వెలిగి, నాటక రంగానికీ వెలుగులు అందజేశారు .
కాని విధి అనుకూలించలేదు .పుష్కలంగా ధనం కీర్తి ప్రతిస్టలతో వెలిగిన గబ్బిట బాల సుందర శాస్త్రిగారి జీవితం వార్ధక్యం లో ఒడి దుడుకులకు లోనై చేతిలో చిల్లిగవ్వకూడాలేని పరిస్థితి కలిగి గర్భ దరిద్రం తో చీకటిలో కూరుకు పోయారు .అలసి సొలసి అలమటించి 66 ఏళ్ళ వయసులోనే 1961 జులై నెల రెండవ తేదీ కన్ను మూశారు.ఒక నట నక్షత్రం రాలిపోయింది.
