కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్… ఐఆర్‌సీటీసీ 15వ తేదీ నుంచి పలు రైళ్లకు టికెట్లను జారీ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఏపీఎస్‌ఆర్టీసీ కూడా ముఖ్య నగరాలు, పట్టణాలకు సర్వీసులను నడిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. లాక్‌డౌన్ మరిన్ని రోజులపాటు పొడిగిస్తారనే ప్రచారం జోరుగా జరగడంతో, లాక్‌డౌన్ పొడిగించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్రం పేర్కొంది. ఈనేపథ్యంలో 14వ తేదీ తర్వాత నుంచి రైలు, విమాన టికెట్ల విక్రయం జరుగుతుండడం విశేషం. అన్ని రైళ్లను ఒకేసారి ప్రారంభించకుండా దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వ్యాపార, వాణిజ్య పనులపై అత్యవసరంగా వివిధ నగరాలకు తిరిగే వారు కూడా ఆయా ఏజెన్సీల ద్వారా విమాన టికెట్లను రిజర్వ్ చేయించుకుంటున్నారు. పలు ప్రైవేటు విమానయాన సంస్థలు డొమెస్టిక్ ట్రావెల్ పరంగా 15వ తేదీ నుంచి బుకింగ్స్‌ను వెబ్‌సైట్లలో చూపుతున్నాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రైళ్లు, బస్సుల్లో తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. వలస కూలీలతోపాటు యాత్రల్లో భాగంగా కాశీ వంటి ప్రాంతాల్లో ఉండిపోయిన తెలుగువారిని సొంత ఊళ్లకు రప్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
