పదసాహిత్య సౌరభాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి తన జీవితకాలాన్ని వెచ్చించిన విదుషీమణి డా।। మంగళగిరి ప్రమీలాదేవి. గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని బేతపూడి అగ్రహారంలో జన్మించారామె. తల్లి జగదాంబ, తండ్రి రాధాకృష్ణమూర్తి. నాన్న ప్రోత్సాహంతో ప్రమీలాదేవి చదువు కొనసాగించారు. గుంటూరు వెళ్లి వీణ వాయించడంలోనూ ప్రావీణ్యం సాధించారు. మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన తర్వాత అలహాబాదు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యరత్న పూర్తిచేశారు. సంస్కృతాంధ్ర ఆంగ్లభాషల్లో మంచి పాండిత్యం సముపార్జించారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఉత్తమ ఉపన్యాసకురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్వర్ణపతకాన్ని అందుకున్నారు. ఇక రచయిత్రిగా ప్రమీలాదేవి మొదటివ్యాసం ‘భారతి’ పత్రికలో అచ్చయింది. అలా సాహితీవ్యాసంగాన్ని ప్రారంభించి, నలభైకి పైగా పొత్తాలను వెలువరించారు. ఈ క్రమంలో ఆవిడకు నోరి నరసింహశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, డా।। బాలాంత్రపు రజనీకాంతరావు, డా।। ఇరివెంటి కృష్ణమూర్తి లాంటి పండితుల ప్రోత్సాహం లభించింది.
ప్రమీలాదేవి 1971లో రచించిన ‘తెలుగులో పద్యగేయనాటికలు’ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘భారతీ కళాతరంగిణి’ వ్యాససంపుటిలో నారాయణతీర్థుల కృష్ణలీలాతరంగాలకు సంబంధించి సరికొత్త సమాచారాన్ని ఆవిడ అందించారు. ‘అన్నమయ్య కీర్తనల్లో జానపద ఛందోరీతులు’ అంశంపై పరిశోధన చేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. ప్రమీలాదేవి మొదట తెనాలి జె.ఎం.జె. మహిళా కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. తర్వాత మచిలీపట్నం వెళ్లారు. ఎప్పుడూ పాఠాలే కాకుండా విద్యార్థులతో చిన్న చిన్న నాటకాలను ప్రదర్శింపజేస్తూ వారిని ప్రోత్సహించేవారు.
పదసాహిత్యానికి విశేష సేవ
‘‘తెలుగులో కనుమరుగవుతున్న పదాలను ప్రోది చేసి, భాషను బతికించేది ఒక్క పదసాహిత్యం మాత్రమే’’ అన్నది ప్రమీలాదేవి విశ్వాసం. అందుకే మరుగున పడిపోయిన పదసాహిత్యాన్ని వెలుగులోకి తేవాలన్న సంకల్పంతో 1989లో ఆవిడ పదసాహిత్య పరిషత్తును స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ముప్పయికి పైగా పుస్తకాలను వెలువరించారు. క్షేత్రయ్య, సారంగపాణి, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి లాంటి పదకర్తల సంకీర్తనల మీద పరిశోధనా వ్యాసాలను రచించారు. ‘ప్రజలమనిషి ప్రకాశం పంతులికి పద్యకవితా కల్హారమాల’ పేరిట ప్రసిద్ధ కవులు రచించిన 77 పద్యకవితలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా ప్రమీలాదేవి ‘మునిపల్లె సుబ్రహ్మణ్యకవి జీవితం- రచనలు’ గ్రంథాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది.
‘‘మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగేసినప్పుడే అనుకున్నది సాధిస్తారని చెప్పిన నాన్న మాటలే నాకు స్ఫూర్తి’’ అనేవారు ప్రమీలాదేవి. సంగీత సాహిత్యాలకు సమప్రాధాన్యమిస్తూ వాగ్గేయకారుల సాహిత్యాన్ని పాఠకులకు అందించడానికి ఆవిడ ఎనలేని కృషిచేశారు. కృష్ణలీలా తరంగాలను బాగా ఇష్టపడటమే కాదు, ఒక మహిళా బృందాన్ని ఏర్పరచి, వారితో తరాంగాల మీద ప్రదర్శనలు ఇప్పించారు కూడా. ప్రమీలాదేవి రచనల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది ‘నారీ మంగళ మహాశక్తి’ గ్రంథం. జాతి గర్వించదగ్గ స్త్రీ మూర్తుల గాథలను నృత్యగేయరూపంలో వివరించిన పుస్తకమిది.
ప్రమీలాదేవికి ‘ఉగాది’, ‘సరస్వతీ సమ్మాన్’ పురస్కారాలు దక్కాయి. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం అందజేసింది. విరామమెరుగని రచనావ్యాసంగంతో సుదీర్ఘ సాహితీయాత్రను సజావుగా సాగించిన ప్రమీలాదేవి నవంబరులో కాలధర్మం చెందారు.
