మల్లాది అచ్యుతరామశాస్త్రి- మచిలీపట్నం

0
789

మల్లాది అచ్యుతరామశాస్త్రి (1872 – 1943) ప్రముఖ నాటక రచయిత మరియు నటులు.ఈయన 1872 కృష్ణ జిల్లా మచిలీపట్నంలో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం
వీరు నటుడిగా, నాటక రచయితగా రంగప్రవేశం చేశారు. 1903లో బందరులోని గొడుగుపేట జగన్మోహిని నాటక సమాజానికి వచన నాటకాలు రాసిచ్చారు. విజయవాడ హిందూ థియేటర్, మైలవరం కంపెనీల కోసం చాలా నాటకాలు రచించారు. వీరి ద్రౌపది వస్త్రాపహరణం, సక్కుబాయి మొదలగు నాటకాలు చాలాసార్లు ప్రదర్శించబడ్డాయి. ఆ తర్వాత కాలంలో రత్నమాల, భక్త చొక్కామీళ, అహల్య, సంగీత సత్యామోద చంద్రోదయం, భక్త కుచేల, రామదూత మొదలైన నాటకాలు రాసి ప్రదర్శించారు. వీరిని 1922 సంవత్సరం విజయనగరంలో ఘనంగా సత్కరించి, నాటక చక్రవర్తి అనే బిరుదును ఇచ్చారు.

రచించిన నాటకాలు
రామరాజ్యవియోగం (1907)
రత్నమాల (1909)
చంద్రకాంత (1909)
సత్యామోద చంద్రోదయం (1909)
రామదూత (1914)
ద్రౌపదీ వస్త్రాపహరణం (1927)
శ్రీకృష్ణలీలలు (1935)
భక్త చొక్కామీళ (1941)
అహల్య (1947)
సతీ సక్కుబాయి (1947)
భక్త కుచేల (అముద్రితం)
రచించిన ప్రహసనాలు
కలివార్త (1900)
గడుసు పెండ్లాము (1913)
తన్ను (1915)
ముద్దు (1915)
ఇద్దరు పెండ్లాల ఇబ్బంది (1921)
అంతాగమ్మత్తు (1926)

అహల్య నాటకం
అహల్య గౌతమ మహర్షి భార్య. ఆమెను బ్రహ్మ లోకంలో అందరికన్నా సౌందర్యవతిగా సృష్టించి ఎవరైతే ముల్లోకాలు మొదట చుట్టివస్తారో వారికే ఆమెను ఇచి పెళ్ళీ చేస్తానని ప్రకటించారు. ఇంద్రుడు తన సర్వశక్తులు ఒడ్డి ముల్లోకాలు చుట్టిరాగా, గౌతమ మహర్షి ప్రసవిస్తున్న గోవు చుట్టూ తిరిగిరావడంతో ఇంద్రునికన్నా ముందే ముల్లోకాలు తిరిగినట్టైందని ఆయనకే ఇచ్చి చేస్తారు. ఒకనాడు కోడి రూపంలో తెల్లవారకుండానే కూసి గౌతముని నదీస్నానానికి వెళ్ళేలా చేసి గౌతముని రూపాన్ని ధరించి వస్తాడు ఇంద్రుడు. అహల్యతో రమించాలని కొరతాడు. ఆయనే తన భర్త అని భ్రమించిన అహల్య అంగీకరిస్తుంది. వెనక్కి తిరిగివచ్చిన గౌతముడు ఇంద్రుడిని అహల్యతో చూసి ఇద్దరినీ శపిస్తాడు. ఆమె అమాయకురాలని, ఇంద్రుడే మోసం చేశాడని అర్థం చేసుకుని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. త్రేతాయుగంలో రామచంద్రుడు గౌతమాశ్రమానికి వచ్చినప్పుడు ఆయన పాదధూళి సోకి శిలయైన అహల్య తిరిగి మానవరూపం చేరుతుంది. ఆ గాథతో అహల్య నాటకాన్ని అచ్యుతరామశాస్త్రి రచించారు.

మరణం
అచ్యుతరామశాస్త్రి 1943లో మరణించారు.

Leave a Reply