మలేషియా మాస్టర్స్‌: సైనా, సింధు శుభారంభం.. శ్రీకాంత్‌, ప్రణీత్‌, కశ్యప్‌ ఔట్…

0
867

 భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ కొత్త ఏడాదిలో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 మలేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రౌండ్లో విజయాలు సాధించారు. అయితే పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌, సాయి ప్రణీత్‌ నిరాశ పరిచారు. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, సమీర్‌ వర్మ మాత్రం తొలిరౌండ్‌ను అధిగమించారు.

బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్‌, ఆరోసీడ్‌ సింధు 21-15, 21-13తో రష్యాకు చెందిన ఎవ్‌గెని కొసెత్సకయాను 35 నిమిషాల్లోనే మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్‌ సైనా 21-15, 21-17తో లియానె టాన్‌ (బెల్జియం)పై విజయం సాధించింది. రెండో రౌండ్లో అయా ఒహొరితో సింధు.. ఎనిమిదో సీడ్‌ అన్‌సే యంగ్‌ (కొరియా)తో సైనా తలపడనున్నారు.ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 17-21, 5-21 తేడాతో రెండో సీడ్‌ చౌ టెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో కనీస పోరాటం కనబరచకుండా వెనుదిరిగాడు. మరో సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ 11-21, 15-21తో రాస్మస్‌ గెమ్కె (డెన్మార్క్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగాడు. కశ్యప్‌ 17-21, 16-21తో మొమోటా చేతిలో ఓటమిపాలయ్యాడు.ప్రణయ్‌ 21-9, 21-17తేడాతో కెంటా సునేయామా (జపాన్‌)పై సునాయాస విజయం సాధించగా.. సమీర్‌ వర్మ 21-16, 21-15తేడాతో కంటఫోన్‌ వాంగ్‌చారియోన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచాడు. రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ మొమోటాను ప్రణయ్‌ ఢీకొనాల్సి ఉండగా.. తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ను ఓడించిన లీ జీజియా (మలేషియా)తో సమీర్‌ గురువారం పోటీపడనున్నాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఎన్‌.సిక్కిరెడ్డి – ప్రణవ్‌ జెర్రీ చోప్రాతో కూడిన భారత జోడీ 10-21, 10-21 తేడాతో టాప్‌ సీడ్‌ చైనా జోడీ హువాంగ్‌ సీవీ – హువాంగ్‌ యాక్వింగ్‌ ద్వయం చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్కమించింది.

Leave a Reply