బందా కనకలింగేశ్వరరావు (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు.వీరు కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. వీరు ఆటపాకలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత బందరు నోబుల్ కళాశాలలో చదివి, మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. 1934లో మొదట న్యాయవాదిగా పనిచేసి, తరువాతి కాలంలో నాటక ప్రదర్శనమే వృత్తిగా చేసుకున్నారు. ఈయన నాటకాలలో అనేక పాత్రలు పోషించాడు.వాటిలో బాహుకుడు, బిల్వమంగళుడు ఈయనకు స్వయంగా ఇష్టమైనవి.వీరు ఏలూరులో 1938లో నాటక కళాశాలను స్థాపించి పలువురు నటులకు శిక్షణ ఇచ్చారు. ప్రభాత్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటక ప్రయోక్తగా నూతన ప్రదర్శన రీతులను ప్రవేశపెట్టారు.ఈయన తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాలైన బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా), సారంగధర (1937 సినిమా) సినిమాలలో నటించాడు.వీరు కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు.ఈ కళ గురించి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు.1956 లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి మంచి నాటకాలను, నాటికలను ప్రసారం చేశాడు. వీరు ఆటపాక గ్రామంలో ఒక శివాలయాన్ని, ఒక చెరువును తవ్వించారు మరియు ఒక వేద పాఠశాలను స్థాపించారు.ఈయన 1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందాడు. వీరి ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.వీరికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.వీరి జన్మ శతాబ్ది ఉత్సవాలను హైదరాబాదులో 2006-07 సంవత్సరాలలో ఘనంగా నిరహించారు.
