ప్రేమగా “రేడియో అక్కయ్య”గా పిలుచుకునే ప్రముఖ రచయిత్రి “తురగా జానకీరాణి”-మచిలీపట్నం

0
1324

1994లో ఆకాశవాణిలో అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన జానకీరాణి తెలుగు సాహిత్యంలో రచయిత్రిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె స్వస్థలం మచిలీపట్నం.ఆమె చదువు మచిలీపట్నం లేడీ ఆంప్తిల్ స్కూల్లో,హిందూ కాలేజీలో జరిగింది.1936, ఆగస్టు 31న జన్మించిన ఆమె 1950వ దశకంలోనే హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆమె భర్త ప్రముఖ జర్నలిస్టు అయిన కృష్ణమోహన్‌రావు 1974లో ఒక రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వీరికి ఉష, వసంత, శోభ అనే కూతుళ్లు ఉన్నారు. చలం మనవరాలైన జానకీరాణి కవయిత్రిగా, రచయిత్రిగా, వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగువారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు.దాదాపు ఆరు దశాబ్దాలుగా ఆమె సాహిత్యం, సామా జికసేవ, నృత్యం, రేడియో ప్రసారాల లాంటి పలు రంగాల్లో తన సేవలు అందించారు. ఇటీవల కూడా ‘తురగా జానకీరాణి కథలు’ పేరుతో ఓ పుస్తకం ప్రచురించారు. ఆకాశవాణిలో ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె చేపట్టిన కార్యక్రమాల్లో బాలజాగృతి ముఖ్యమైనది. పిల్లల హక్కులు, బాలకార్మిక వ్యవస్థలపై దీనిద్వారా ఆమె గళమెత్తారు. తురగా జానకీరాణి మొత్తం 27 పుస్తకాలు రాశారు. ఆమెకు 1982లో ఒకసారి గృహలక్ష్మి స్వర్ణకంకణం, తెలుగుయూనివర్సిటీ ఇచ్చే ఉత్తమ రచయిత్రి పురస్కారాలు రెండుసార్లు వచ్చాయి. ఆమె రాసిన వందలాది కథలు, కథానికల్లో కొన్ని ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, కన్నడం, ఒరియా, మరాఠీ, తమిళ భాషల్లోకి అనువాదం అయ్యాయి. రేడియో, టీవీ, పత్రికలకు దాదాపు 200 కథనాలు రాశారు. దూరదర్శన్‌ ఆమెపై ప్రత్యేకంగా గంట నిడివిగల డాక్యుమెంటరీ తీసింది. ఆమె రూపొందించిన పలు కార్యక్రమాలకు నాలుగుసార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. జానకీరాణి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు.

Leave a Reply