జాతీయ పురస్కార గ్రహీత, దర్శకుడు-తోట తరణి-మచిలీపట్నం

0
844

తోట తరణి ఒక ప్రముఖ సినీ కళా దర్శకుడు. జాతీయ పురస్కార గ్రహీత.సుమారు 100 సినిమాలకు పైగా కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు.తోట తరణి స్వస్థలం బందరు. తండ్రి తోట వెంకటేశ్వర రావు నాటకరంగ కళాకారుడు. ఆడ వేషాలు వేయడంలో నేర్పరి. ఆయనకు ఎనిమిది మంది సంతానం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తం సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వెళ్ళాడు. మల్లీశ్వరి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. జయసింహ, అమరదీపం, పాండురంగ మహత్మ్యం, శంకరాభరణం, సిరిసిరిమువ్వ తదితర ప్రఖ్యాత సినిమాలకు ఆయనే కళాదర్శకుడు. దాంతో ఆయనకు మంచి పేరు వచ్చింది.

తరణికి ఐదేళ్ళ వయసు నుండే కళారంగం మీద ఆసక్తి మొదలైంది. కాగితం దొరికితే ఏదో ఒక బొమ్మలు గీస్తుండే వాడు. ఆయన చదువుకూడా సరిగా సాగలేదు. ప్రైవేటుగా మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి తప్పాడు. తరువాత ఎన్. టీ. ఆర్ ప్రోత్సాహంతో మళ్ళీ చదివి మెట్రిక్యులేషన్ పాసై తరువాత చిత్రలేఖనంలో డిప్లోమా, మరియు పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. తరువాత ముంబైలో ఒక కంపెనీలో ఆర్టిస్టుగా పనిచేశాడు. మద్రాసుకు తిరిగి వచ్చి తండ్రికి సినిమా సెట్లలో సహకరించడం మొదలుపెట్టాడు.తండ్రితో పనిచేసేటపుడు అతని ప్రతిభను గమనించిన కొందరు అతనికి నాగమల్లి అనే సినిమాలో అవకాశం కల్పించారు. తరువాత మౌనరాగం, అమావాస్య చంద్రుడు, నాయకుడు, అంజలి, దళపతి, రోజా, బొంబాయి తదితర విజయవంతమైన చిత్రాలకు పనిచేయడంతో అతని ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది. గీతాంజలి, శివ, చైతన్య, నిర్ణయం, చినరాయుడు, శుభ సంకల్పం, చూడాలని ఉంది, మృగరాజు, మాస్ లాంటి కమర్షియల్ చిత్రాలకు కూడా పనిచేశాడు. మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా కోసం మదుర మీనాక్షి దేవాలయం సెట్టు వేశాడు. తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో కూడా అప్పటి కాలానికి తగ్గ సెట్లు వేశాడు.

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు : 1989 (నాయకుడు), 1997 (భారతీయుడు), 2007 (శివాజీ)
పద్మశ్రీ పురస్కారం (2001).

చిత్ర సమాహారం
1957 : పాండురంగ మహత్యం
1977 : ఎదురీత
1978 : సొమ్మొకడిది సోకొకడిది
1982 : శుభలేఖ
1983 : నెలవంక
1985 : అన్వేషణ
1989 : నాయకుడు, శివ
1990 : అంజలి
1991 : దళపతి
1993 : జంటిల్ మేన్
1994 : ప్రేమికుడు
1996 : ప్రేమదేశం, బొంబాయి, భారతీయుడు
1998 : జీన్స్
2004 : అర్జున్, మాస్
2005 : అతడు, చంద్రముఖి
2007 : శివాజీ
2008 : కథానాయకుడు, దశావతారం
2010 : లీడర్

Leave a Reply