కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో ఎక్కడో చివర వరుసలో ఉన్న కృష్ణా జిల్లా ముఖ్యంగా అమరావతి రాజధాని నగరం విజయవాడ ఇప్పుడు మొదటి వరుస క్రమంలోకి చేరింది. ఏపిీలో అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న కర్నూలు, గుంటూరు సరసన విజయవాడ చేరింది. ఒక్క ఆదివారం నాడే ఊహించని స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఆదివారం నాడు ఒక్కరోజలో విజయవాడలో 52 కేసులు నమోదయ్యాయిు. దీంతో గతంలో కేవలం ఆరు ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా పరిగణించగా, ఇప్పుడు వాటి సంఖ్య తొమ్మిదికి చేరింది. విజయవాడ కృష్ణలంకలోనే 24 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటితో పాటు కృష్ణలంక రణదివెనగర్, కార్మికనగర్, మాచవరం, పాయకాపురం, ఆర్ ఆర్ పేట, హౌసింగ్‌బోర్డు కాలనీ, కుమ్మరిపాలెం తదితర ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి అక్కడకు ఎవరిని వెళ్లనీయకుండా, అక్కడ నుంచి ఎవరిని బయటకు వెళ్లనీయకుండా కట్టడి చేస్తు ఆయా ప్రాంతాల ప్రజలకు అవసరమైన ఆహార ప దార్ధాలను అందజేస్తున్నారు. అంతేగాక కృష్ణలంక ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల పెరుగుదలతో ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మందిని వివిధ క్వారంటైన్‌లకు అధికారులు ఆదివారం తరలించారు. రెండు రోజులుగా విజయవాడలో పాజిటివ్ కేసుల పెరుగుదలకు ఇద్దరే కారణమన్న విషయాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తితో పాటు కృష్ణలంకకు చెందిన లారీడ్రైవర్ కారణంగానే పాజిటివ్ కేసులు పెరిగినందున వారిద్దరిపై అంటువ్యాధుల నిరోధక చట్టంతో పాటు మరి కొన్ని సెక్షన్‌ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా రెడ్ జోన్లలో పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బంది, అధికారులు కవాతు నిర్వహించారు. కృష్ణలంకలో జరిగిన కవాతుకు కలెక్టర్ ఇంతియాజ్, పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వం వహించారు. ఈ కవాతులో ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. ప్రజలు నిబంధనలు పాటించని కారణంగానే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ అన్నారు. లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటున్నా కొందరు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల కార్మికనగర్ లో 20 కేసులు నమోదయ్యాయని పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. రెడ్‌జోన్లలో ఇష్టం వచ్చిన విధంగా ఎవరు ప్రవర్తించినా ఇకపై పోలీసు చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిని ఇకపై డ్రోన్ల ద్వారా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
