కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని ఎలకుర్రు గ్రామంలో జన్మించిన నాగేశ్వరరావు పంతులు గారు తండ్రి సాంప్రదాయ విద్య నేర్చుకోమన్నా తల్లి ప్రోద్బలంతో బందరు హిందూ హైస్కూల్లో చదివి మెట్రిక్ పూర్తిచేసారు.
అప్పట్లో ధార్వాడ నాటక సమాజ ప్రభావం పడి నాగేశ్వరరావు గారికి నాటకాల మీద ఆసక్తి పెరిగింది. హిందూ థియేటర్ ద్వారా నాటకాలలో వేషాలు వేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణ తులాభారంలో రుక్మిణి, హరిశ్చంద్రలో చంద్రమతి లాంటి స్త్రీ వేషాలు వేశారు.
నాగేశ్వరరావు పంతులు గారి కళాశాల విద్య గుంటూరు, మద్రాసులలో సాగింది. అక్కడ ఉండగానే 1890 లో రామాయమ్మ గారితో ఆయన వివాహం జరిగింది. తొలిరోజుల్లో ఆయన జీవితం నల్లేరు మీద నడక కాలేదు. 1892 లో బొంబాయిలోను, తర్వాత రెండేళ్లకు కలకత్తాలోను వ్యాపారాలు చేసారు. కలకత్తాలో ఆరోగ్యం సరిపడక కొన్నాళ్ళు స్వగ్రామం వచ్చిన ఆయన తిరిగి బొంబాయి చేరి కొన్ని ఉద్యోగాలు చేసారు. ఆంగ్లేయులకు చెందిన ‘ విలియం అండ్ కో ‘ అనే సంస్థలో పనిచేసి మంచి పేరు సంపాదించారు. దానికి ప్రతిఫలంగా ఆ యజమాని ఇంగ్లాండ్ వెళ్లి పోతూ ఆ సంస్థను నాగేశ్వరరావు గారికి అప్పగించాడు. ఇదే ఆయన జీవితంలో పెద్ద మలుపయింది. 1899 లో ‘ అమృతాంజనం ‘ తయారు చేసారు. దాంతో పేరు, డబ్బు రెండు ఆయన స్వంతమయ్యాయి.
స్వాతంత్ర్య ఉద్యమంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించింది. ఆ రాష్ట్ర ప్రజలలో జాతీయ భావాన్ని పెంచడంలో పత్రికలు కీలకమైన పాత్ర పోషించాయి. ఇది నాగేశ్వరరావు పంతులు గారిని ఆలోచింపజేసింది. ఫలితంగా 1909 వ సంవత్సరం సెప్టెంబర్ 9 వ తేదీన ‘ ఆంధ్రపత్రిక ‘ ఆవిర్భవించింది. బొంబాయి నుంచి వారపత్రికగా ప్రారంభమైన ‘ ఆంధ్రపత్రిక ‘ 1914 ఏప్రిల్ 1 వ తేదీన మద్రాసునుంచి దినపత్రికగా వెలువడింది. స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రపత్రిక పాత్ర మరువలేనిది. గ్రంథాలయోద్యమానికి ఆయన అందించిన చేయూత విశిష్టమైనది. ఖద్దరు ఉద్యమంలో, హోంరూల్ ఉద్యమంలో ఇంకా అనేక జాతీయోద్యమాలలో కీలక పాత్ర పోషించారు. 1924 అక్టోబర్ లో మద్రాసులో కట్టమంచి రామలింగారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఆంధ్రమహాసభలలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి ‘ దేశోద్ధారక ‘ బిరుదు ప్రదానం చేశారు. 1933 డిసెంబర్ 30 న గాంధి మహాత్ముని చేతుల మీదుగా ‘ విశ్వదాత ‘ బిరుదును అందుకున్నారు పంతులుగారు.
1930 లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1932 లో శాసనోల్లంఘన ఉద్యమంలోను పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన ఒప్పందం జరిగిన ‘ శ్రీబాగ్ ‘ నాగేశ్వరరావు పంతులుగారి స్వగృహమే !
సాహిత్యాభిలాషతో ఆయన 1924 లో ‘ భారతి ‘ మాసపత్రికను ప్రారంభించారు. ఆరోజుల్లో భారతిలో రచన ప్రచురింపబడడం రచయితలకు గర్వకారణంగా ఉండేది. పాల్కురికి సోమనాథుని బసవపురాణానికి, ఇంకా శతకకవుల చరిత్ర, శతకమంజరి లాంటి చాలా గ్రంథాలకు పీఠికలు రచించారు. ఆయన సాహిత్య ప్రస్థానంలో చెప్పుకోదగ్గది ‘ ఆంధ్ర వాజ్మయ చరిత్రము ‘ రచన. సుమారు అయిదారు సంబత్సరాల కాలాన్ని వెచ్చించి రచించిన గ్రంథం ఇది.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా , రాజనీతిజ్ఞునిగా, గుప్తదాతగా, దేశభక్తునిగా, పత్రికాసంపాదకునిగా, ప్రచురణకర్తగా ప్రసిద్ధి చెందిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి జన్మదినం మే 1 వ తేదీ.
