అయ్యదేవర కాళేశ్వరరావు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు–మచిలీపట్నం

0
2365
ayyadevara kaleswara rao

భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాటం సాగించిన మహా నాయకులలో తొలితరం తెలుగు నాయకులు కాశీనాథుని నాగేశ్వరరావు, కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం మొదలైనవారు కాగా మలితరం మహానాయకులు డా.పట్ట్భాసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారు.
 

కాళేశ్వరరావు పశ్చిమ కృష్ణా జిల్లా నందిగామ వాసి. కాళేశ్వరరావు 1881 జనవరి 22వ తేదీన జన్మించారు. కాళేశ్వరరావు ప్రాథమిక విద్య స్వగ్రామం నందిగామలోనే జరిగింది. ఉన్నత విద్య కాస్త ఆలస్యంగా 1894-1901లో బందరులో జరిగింది. బందరులో రఘుపతి వెంకటరత్నంనాయుడుగారి శిష్యులైనారు. వేమూరి రామకృష్ణారావుగారివద్ద ఇంగ్లీషు అభ్యసించారు. అక్కడ డా.పట్ట్భా, ముట్నూరి కృష్ణారావుగారలతో మైత్రి ఏర్పడింది. ఇంగ్లీషులో లెక్కలలో ప్రావీణ్యం సంపాదించారు. మదరాసువెళ్లి ఇంజనీరు కావాలనుకున్న కాళేశ్వరరావు కోరిక నెరవేరలేదు. బందరులోనే చరిత్రలో పట్ట్భద్రుడు కావలసి వచ్చింది. కాళేశ్వరరావు ప్రతిభను గుర్తించి ఆయనను అదే స్కూలులో చరిత్ర ఉపాధ్యాయుడుగా ఏర్పాటుచేశాడు. 1901-1903 ఉపాధ్యాయుడిగా ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు కాళేశ్వరరావు.

1904-1905 సంవత్సరాలలో కాళేశ్వరరావు మదరాసులో లా చదివి న్యాయవాది అయినారు. మదరాసులో వీరికి కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగంగారలతో పరిచయం ఏర్పడింది. ఆ కారణంగా సంఘ సంస్కరణోద్యమ బీజం పడింది.  

రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను వీరు పనిచేశారు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.

1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు.  ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతొమందికి విద్యాదానము చేసారు.

1939లో మదరాసు అసెంబ్లీకి కాంగ్రెస్ పక్షాన వియవాడ బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి అఖండ విజయం సాధించారు. రాజగోపాలాచారి ప్రధానమంత్రిగా మదరాసు ప్రభుత్వమేర్పడింది. దానిలో కాళేశ్వరరావు రాజగోపాలాచారిగారి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందారు.

1946లో శాసనసభకు విజయవాడ నుంచి ఎన్నికైన కాళేశ్వరరావు ప్రకాశంగారి పక్షం వహించారు. ప్రకాశంగారి మంత్రివర్గంలో కాళేశ్వరరావుకు మంత్రి పదవి రాలేదు కాని వారి శిష్యుడు వేముల కూర్మయ్యగారికి మంత్రి పదవి ఆయనవల్ల లభించింది. ప్రకాశంగారి ప్రభుత్వం ఏడాదిలోపే పడిపోయింది. అయినా కాళేశ్వరరావు ప్రకాశం పక్షాన ఉన్నారు.

1947లో బహుభార్యాత్వ నిషేధపు బిల్లు ప్రవేశపెట్టారు కాళేశ్వరరావు. 1955 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కాళేశ్వరరావు విజయవాడ స్థానం నుంచి ఎన్నికైనారు. తర్వాత ముఖ్యమంత్రి పదవికి గోపాలరెడ్డిగారు ఎన్నికయ్యారు. ఆవిధంగా ఏర్పడిన రాష్ట్ర తొలి అసెంబ్లీకి అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్‌గా ఎన్నుకున్నారు.

రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా ‘ఫ్రెంచి విప్లవ చరిత్ర’, ‘అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర’, ‘తురుష్క ప్రజాస్వామికం’, చీనా జాతీయోద్యమ చరిత్ర’ మరియు ‘ఈజిప్టు చరిత్ర’ అను పుస్తకాలను రచించారు. ఈయన జీవిత చరిత్ర నవ్యాంధ్ర – నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది.

1962 ఫిబ్రవరి 26వ తేదీన విజయవాడలో పరమపదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here