హైదరాబాద్, పుణెలలో ఉత్పత్తి
అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం
సెప్టెంబర్ నాటికి లక్షల టీకాలు రెడీ
కరోనా మహమ్మారిని అంతమొందించే టీకా భారత్ నుంచే ముందుగా వెలువడనుందా అవుననే అంటున్నారు శాస్త్రజ్ఞులు. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే విశ్వసిస్తోంది. ఇప్పటికే భారత్‌లోని అరడజనుకు పైగా ప్రఖ్యాత కంపెనీలు వివిధ అంతర్జాతీయ పరిశోధనాలయాలతో కలిసి ఇందులో నిమగ్నమై ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేసి అమ్మకాలు సాగించే టీకా తయారీ సంస్థ శీరం పరిశోధనల్లో చాలా ముందు ఉందని చెబుతున్నారు. పుణెలో రెండు పరిశోధన, ఉత్పత్తి యూనిట్లను కలిగి ఉన్న ఈ సంస్థ ప్రతి ఏటా 1.5 బిలియన్ డోస్‌ల టీకాలను ఉత్పత్తి చేసి అమ్ముతోంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్, జెక రిపబ్లికలేలోనూ యూనిట్లు ఉన్నాయి. మొత్తం 165 దేశాల్లో 20కి పైగా అంటువ్యాధుల నిరోధక టీకాలను ఈ సంస్థ ఉత్పత్తి చేసి అమ్ముతోంది. ఒక్కో టీకా సరాసరిన కేవలం రూ.30లకు ఈ సంస్థ విక్రయిస్తోంది. 53 ఏళ్లుగా సేవలు అందిస్తోన్న ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల మంది నిపుణులు పనిచేస్తున్నారు. అమెరికాకు చెందిన కోడాజెనిక్స, యూకెలోని ఆక్సఫర్డ్ యూనివర్శిటీ పరిశోధనా విభాగాలతోనూ కలిసి ఈ సంస్థ కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉంది. చింపాంజీ జీన్స్ నుంచి అభివృద్ధి పరిచిన టీకాను ఇప్పటికే తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసింది. అతి త్వరలో అంటే సెప్టెంబర్ నాటికి టీకా సిద్ధం చేసి లక్షల డోస్‌లను ఉత్పత్తి చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. అలాగే, హైదరాబాద్ కంపెనీలు కూడా పరిశోధనల్లో చాలా ముందు ఉన్నాయి. అమెరికాకు చెందిన విస్కాన్సిన్ యూనివర్శిటీ, బయో సంస్థ ఫ్లూజెన్‌లతో కలిసి భారత్ బయోటెక పరిశోధనలు జరుపుతోంది. 300 మిలియన్ డోస్‌లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఈ సంస్థకు ఉంది. అతి త్వరలోనే ఇక్కడి నుంచి కూడా టీకా సిద్ధమవుతోందని తెలుస్తోంది. జైదస్ క్యాడిల్లా సంస్థ కూడా రెండు వ్యాక్సిన్‌లను తయారు చేయడానికి పరిశోధనలు జరుపుతోంది. ఈ సంస్థ నుంచి కూడా టీకాలు త్వరలోనే ఉత్పత్తికానున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలు బయోలాజికల్-ఇ, మిన్వాక్స (బెంగళూరు) సంస్థలు కూడా విడివిడిగా టీకాల తయారీలో చాలా ముందున్నాయి. ఇవేకాకుండా మరో నాలుగైదు సంస్థలు కూడా కరోనా నిరోధక టీకా ఉత్పత్తిలో పరిశోధనలు జరిపి ఇప్పటికే మంచి ఫలితాలను సాధించాయి.
