లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 200 రైళ్లను నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రైళ్ల రాకపోకలు ఏమిటి? ఏయే రూట్లలో నడుస్తాయి? ప్రయాణ వేళలు ఏమిటి? అన్న వివరాలను నిన్న రాత్రి రైల్వే బోర్డు ఖరారు చేసి ఆ వివరాలను అన్ని జోన్ల జీఎంలకు పంపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రూట్లను ఎంపిక చేశారు.
నేటి నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభం కానుండగా, స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత 200 టికెట్లను వెయిటింగ్ లిస్టులో జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు నడిపిన ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు లేకపోగా, జూన్ 1 నుంచి నడపనున్న రైళ్లు సాధారణ రైళ్లలాగా, ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే, స్టాపులు కూడా గతంలో మాదిరిగానే ఉంటాయి.
రైల్వే నడపనున్న 200 రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్నాయి. అవేంటంటే..
- ముంబై- హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02)
- హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (02703/04)
- హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (02723/24)
- దానాపూర్-సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92)
- విశాఖపట్టణం- ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (02805/06)
*గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (07201/02) - తిరుపతి-నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02793/94),
- హైదరాబాద్-విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727/28)
- వీటితోపాటు సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (02285/86) రైలును వారానికి రెండుసార్లు నడపనున్నారు.
- హౌరా-యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ (02245/46) ఇది వారానికి ఐదు రోజులు నడుస్తుంది. అలాగే, ముంబై సీఎస్టీ-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (01019/20) రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ మీదుగా నడుస్తాయి. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రోజూ నడుస్తుంది.
ఇక, అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ రైళ్లలో సాధారణ బోగీలు ఉన్నప్పటికీ వాటికీ రిజర్వేషన్ ఉంటుంది. అంటే రైలులోని అన్ని బోగీలు రిజర్వేషనే అన్నమాట. జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారి నుంచి ద్వితీయ శ్రేణి సీటింగ్ రుసుమును వసూలు చేస్తారు. టికెట్లు అన్నింటినీ ఆన్లైన్లోనే తీసుకోవాలి. రైల్వే స్టేషన్లో టికెట్లు విక్రయించరు. నెల రోజుల ముందుగా కూడా టికెట్లను రిజర్వు చేసుకునే వీలుంది.
