ప్రముఖ గాయకులు జి.వి ప్రభాకర్ నాన్నగారు-లాయరు,కార్మిక నాయకుడు- గరికపాటి బాల వెంకట సుబ్బరాయశాస్త్రి-మచిలీపట్నం,

0
753

గరికపాటి బాల వెంకట సుబ్బరాయశాస్త్రి గారి గురించి అయన కుమారుడైన జి.వి.ప్రభాకర్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళ నాన్నగారి గురించి ఇలా చెప్పుకొచ్చారు ….

మా నాన్నగారి పేరు గరికపాటి బాల వెంకట సుబ్బరాయశాస్త్రి. అమ్మగారి పేరు మీనాక్షి. మేము ఆరుగురు సంతానం. నేను నాలుగవవాడిని. నా ముందు ఒక అక్క, నా తర్వాత చెల్లి. డిగ్రీ పూర్తయ్యి, నేను ఇరవయ్యో యేట అడుగిడే సమయంలో ఆయన ఈశ్వరైక్యం చెందారు. నా జీవితంలో మా నాన్నగారితో గడిపిన కాలం కేవలం 19 సంవత్సరాలైనా నాపై జీవితాంతం చెరగని ప్రభావం వేశారాయన. నాపైనే కాదు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ జీవితాలపై కూడా ఆయన ముద్ర ఉంటుంది. నాన్నగారి గురుంచి, బాల్యంనుంచి ఇప్పటివరకు మమ్మల్ని ఎరుగున్నమా బంధువర్గం, పెద్దలు, నాన్నగారి మిత్రులు, సన్నిహితులు ఇప్పటికీ అంటోంటారు మాతో మాట్లాడుతుంటే అచ్చం ఆరోజుల్లో మా నాన్నగారిని చూస్తూ ఆయనతో మాట్లాడుతున్నట్లే ఉంటోందని. అప్పుడు మేమనుకుంటాం” ఓహో!. మా నాన్నగారు మాకే తెలియకుండా మాలో personify అయిపోయారన్నమాట “.

మా నాన్నగారు అపార మేధస్సు కల్గిన అతి సున్నిత మనస్కులు. న్యాయవాది అయిన వారు బహుముఖ ప్రజ్ఞాశీలి కూడా. ఈ రోజుల్లోలాగ ఆయనకు ప్రతిభాపాటవాలను పదిమందీ గుర్తించాలని, పేరు తెచ్చుకోవాలన్న కీర్తి కండూతి ఉండేది కాదు. అయినా కూడా కృష్ణా, గుంటూరు, హైద్రాబాదు పరిసర ప్రాంతాల్లో ఆయన పేరు మారుమ్రోగేది. ఆయన వాదిస్తుంటే జడ్జీలతో పాటు తోటి లాయర్లు అబ్బురపడుతూవినేవారు. కోర్టు సమయం దాటినా కేసుని వాయిదా వెయ్యాలనిపించేది కాదు అంటుండేవారు అప్పటి జడ్జీలు. ఒక టీచర్ గా పనిచేస్తూ గాయకుడిగా ఎదిగి మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాదు, అమెరికా, కెనడా తదితర ప్రాంతాల్లో పేరు తెచ్చుకున్నానంటే, శాస్త్రం, గాత్రంతో పాటు వాక్పటిమకు కూడా ప్రశంసలు అందుకుంటుంటే అదంతా మా నాన్నగారి చలవే అనుకుంటూ ఉంటాను. నాలో ఉన్న ఆయన జీన్స్ ప్రభావమది అన్పిస్తూంటుంది.

మా నాన్నగారి బాల్యం అతి సున్నితంగా గడిచింది. ఆయన తన తండ్రిని చూసుకునే భాగ్యానికి నోచుకోలేదు. మా నాన్న గారు తన తల్లి గర్భంలో ఉండగానే ఆయన తండ్రి అంటే మా తాతగారు గరికపాటి ప్రకాశరావు గారు విష జ్వరం సోకి హఠాత్తుగా మరణించారు. ఇప్పట్లా అభివృద్ది చెందిన వైద్య విధానాలు అప్పుడుండేవి కావు. మా తాతగారొక గొప్ప భూకామందు. ఆస్తిపరులు. రాజమండ్రి సమీపంలోని పిప్పర్ర వద్ద మాకు వందలాది ఎకరాలు భూములుండేవి. సొంత వ్యవసాయం కొంత, కౌలుకిచ్చింది కొంతగా ఉండేది. తర్వాత మా నానమ్మగారే పొలం వ్యవహారాలు చూసుకునేవారు. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయిన తర్వాత పుట్ట్డడంతో, తండ్రిని కోల్పోయిన పసిబిడ్డ కావడంతో ఆయన్ని చాలా అపురూపంగా పెంచారు మా నానమ్మగారు. రాజమండ్రిలో మా నాన్నగారి విధ్యాభ్యాసం పూర్తయ్యాక అప్పటి చెన్నపట్నంలో న్యాయవాద విద్య అభ్యసించడానికి బయలుదేరారాయన.

యేడెనిమిది మంది సంతానం సాధారణంగా ఉండే ఆ రోజుల్లో మా నాన్నమ్మకు నాన్న ఒక్కరే కొడుకు కావడం, దురదృష్టవశాత్తూ తండ్రి ప్రేమకు ఆయన దూరం కావడంతో ఆయన్ని తల్లి, బంధువర్గం ఎంతో ఆత్మీయంగా పెంఛారు. ఒక పక్క తల్లి అందించే అనురాగం మరో పక్క ఆవిడ పడిన కష్టాలు చిన్న వయస్సులోనే చూడటం, ఆందునా సూక్ష్మగ్రాహి కావడం వల్ల ఆయనకు చాలా సున్నితమైన మనస్తత్వం అలవడింది. లోతైన భావాలు, నిదానం, ఉద్వేగాలు బయటకు కనిపించకుండా నియంత్రించుకోవడం, జీవితం పట్ల అవగాహన యేర్పడ్డాయి. బంధువుల అనుబంధాలు, కుటుంబ విలువలు, ఆప్యాయ బంధాల మధ్య బాల్యం గడవడంతో వాటి విలువనెప్పూడూ మరవలేదు ఆయన. తను స్వయంగా ఆస్తిపరురాలు కావడంతో తన సోదరులను తరచూ ఆదుకునేది మా నానమ్మగారు. ఇవన్నీ గమనించేవారు మా నాన్న. దాంతో ఆయనలో తెలీకుండానే బంధుప్రీతి యేర్పడిపోయింది. నాన్నగారి జమానా వచ్చేసరికి బంధువులతో ఎప్పూడూ కళకళలాడుతూ ఉండేది మా ఇల్లు. మా నానమ్మగారికి వారి తండ్రి జడ్జి వారణాసి సుబ్రహ్మణ్యం గారినుండి ఒక బంగళా సంక్రమించింది.మచిలీపట్నం లోని ఆ బంగళాకు వారసుడు మా నాన్నగారు కావడం మేమందరం అక్కడే జన్మించాము. పెరిగాము. చాలా విశాలమైన ఇల్లది. మా నాన్నగారి మనస్సులాగే!.

నాన్నగారి గొప్పదనం చెప్పాలంటే, అప్పట్లోనే లక్షలు విలువ చేసే ఆస్థి, ఒక్కడే కొడుకు కావడం, ఎంతగానో గారాబం చేసే తల్లి .. అయినా యేనాడూ ఆయన బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించలేదు. ఎటువంటి ప్రలోభాలకు, విలాసాలకు, తిరుగుళ్ళకు లోనుకాలేదు. ఇందుకు కారణాలు ఆయన యేర్పర్చుకున్న వ్యక్తిగత క్రమశిక్షణ, తల్లంటే ఆయనకున్న గౌరవం, జీవిత విలువలు బాల్యంలోనే గ్రహించి ఉండటం.

న్యాయవాదవిద్యనభ్యసించడానికి చెన్నపట్నం పంపుతూ ఆయనతో చెప్పింది వాళ్ళమ్మ ” నాయనా, నువ్వు ఆగర్భ శ్రీమంతుడివి. నీ భవిష్యత్తు, ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాల్సింది నువ్వే. చాలా జాగ్రత్తగా ఉండు. ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దు. మన వంశ ప్రతిష్టను పాడు చెయ్యద్దు. నేను నిన్ను చూసుకోవాలి, నీలోనే నీ తండ్రిని చూసుకోవాలి. జాగ్రత్త బాబూ..” అని. ఆ మాటలు మా నాన్నగారి హృదయాంతరాల్లో నాటుకుపోయాయి. ఆ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారాయన. తనని తాను మరింతగా తీర్చిదిద్దుకున్నారు. మరిన్ని ఉన్నత విలువలనేర్పర్చుకున్నారు. వ్యక్తిత్వానికి వన్నెలద్దుకున్నారు. ఎక్కడో చెన్నపట్నం… ఒంటరిగా అక్కడుండటం… చేతినిండా డబ్బు.. అయినా ఎప్పుడూ గతి తప్పలేదాయన. స్నేహితులతో చెడుతిరుగుళ్ళు, చెడు సావాసాలు ఇలాంటివెరుగరు ఆయన. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గ్రంధపఠనం అలవర్చుకున్నారు. నైతికత పునాదిగా జీవితాన్ని ఉత్తమ విలువలతో నిర్మించుకున్నారు.

1948 ప్రాంతాలో మచిలీపట్నంలో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు మా నాన్నగారు. మొక్కలపెంపకం ఆయనకు చాలా ఇష్టం. కోర్టునుండి రావడంతోపాటే కొంత సమయాన్ని తోటపనికి వెచ్చించేవారు. కావల్సినంత స్థలం ఉండటంతో అరుదైన మొక్కలు, రకరకాల పూలజాతుల మొక్కలు మా తోటలో ఉండేవి. డాలియాలు, రకరకాలైన గులాబీలు, అందమైన క్రీపర్లు ఇంకా ఎన్నో .. ప్రత్యేకంగా మా తోటను, అందులోని పూలను చూడటానికి జనం వచ్చేవారు. ఎక్కడెక్కడి గులాబీలో, ఏవేవో తెచ్చి పాతుతూండేవారు. మొక్కల్నిపసిపిల్లల్లా సాకేవారు. గార్డెన్లో కుర్చీలు.. వచ్చినవారితో చక్కగా అక్కడ మాట్లాడటం.. ఇలా ఉండేది. ఆయన లైబ్రరీలో అపురూపమైన పుస్తకాలుండేవి. చిన్నప్పుడు వాటి విలువ తెలిసేది కాదు మాకు. తర్వాత తర్వాత తెలిసింది. ఒకపక్క ధార్మిక గ్రంధాలు, సాహిత్యం, కళలు, తత్త్వశాస్త్రాలు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద సాహిత్యం, మరోపక్క గాంధీ, నెహ్రూల పుస్తకాలు, నెహ్రూ తన కుమార్తెకు రాసిన ఉత్తరాలు, ఇంకోపక్క డాంగే, కమ్యూనిజం పుస్తకాలు ఇలా ఎన్నెన్నో వైవిధ్యభరితమైన సబ్జెక్టులు. ఆయన ట్రేడ్ యూనియన్ నాయకులు కాబట్టి కమ్యూనిజం భావాలు, వ్యక్తిగతంగా గాంధీ, నెహ్రూల, ఇందిరాగాంధీల భావజాలాలు ఆయనకు చాలా ఇష్టం. వ్యక్తిగతంగా కాంగ్రెస్‌ని అభిమానించేవారు ఆయన. ఆయన పుస్తకాలన్నీ ఆయన ఇరవయ్యొవయేటే సేకరించి పెట్టుకోడం విశేషం. ఆయనకు వయస్సుతో పాటు క్రమేణా మరొక అపురూపగుణం మరింత అలవడుతూ వచ్చింది. సంపద ఉన్నవాడిగా ఆయనకు సంపదలేని పేదల్ని చూస్తే ఎంత జాలో. ఎప్పూడూ వారినాదుకోవాలి. అదే తాపత్రయం.. అదే ప్రయత్నం.. అలా అని చేసిన సాయాన్ని బయటవాళ్ళకి చెప్పుకోకూడదు.. హంగామా చేయకూడదు. అదీ మానాన్నగారంటే..

గుమ్మందాటి అనవసరంగా బైటికెళ్ళేవారుకాదు. గుమ్మంలోకి వచ్చినవారిని వట్టి చేతులతో పంపేవారు కాదు. అందుకే మా ఇంటికి రావాలని అందరూ కోరుకునేవారు. మా ఇంటికి ఎప్పుడూ ఎవరోకరు బంధువులు రావడం, ఆయన ఆప్యాయంగా పలకరించడం, వసతి సౌకర్యాలు సరిగ్గా అందుతున్నాయో లేదో స్వయంగా పర్యవేక్షించడం.. అందరూ కలిసి భోజనాలు చేయటం, మా బంధువులతోపాటు వచ్చిన మా ఈడు పిల్లలతో ఆడుకోడం, ఇంట్లో బంధువుల్ని చూసే విధానం గమనించడంవల్ల మాలో కుటుంబ విలువలు, బంధుత్వ విలువలు, వచ్చిన వారిని ఆప్యాయంగా ఎలా చూసుకోవాలో అలవడింది. ఈ రోజుకీ ఆ బంధుత్వాలను అలా మెయిన్‌టైన్ చెయ్యగల్గుతున్నాము. వ్యక్తిముందు ఆప్యాయంగా మాట్లాడటం,, వాళ్ళు గుమ్మం దాటాక హమ్మయ్య పోయాడు అనుకోడం, ఏదో చెయ్యాల్సి వచ్చింది కాబట్టి చేసాం.. ఇలాంటి ప్రవర్తన మా నాన్న అమ్మగార్లలో ఎప్పుడూ చూడలేదు. నాన్నగారికి తగ్గ ఇల్లాలు మా అమ్మ. మీరు ఫలానా వాళ్ళకు అనవసరంగా సాయం చేసారు, అలా చెయ్యకుండా ఉండాల్సింది అన్న మాట మా అమ్మగారెన్నడూ అనకపోవడం విశేషం. వాళ్ళిద్దరూ మాటా మాటా అనుకోవడం మేమెరుగం. ఇలా మా నాన్నగారికి అన్నివిధాలుగా అనుకూలవతి మా అమ్మగారు. బంధువులు ఎన్ని రోజులున్నా మర్యాదలో లోపం ఉండేది కాదు. మా బంధువుల పిల్లల చదువులకి అప్పట్లోనే వేలాది రూపాయల సాయమందించేవారు. ఉద్యోగాలకు సెక్యూరిటీ డిపాజిట్ చేసేవారు. చదువు, కెరీర్ల విషయంలో మొహమాటపడద్దనేవారు. కొన్ని సందర్భాల్లో ఎవరెందుకొచ్చారో, ఎవరెలాంటివాళ్ళో, ఎవరివల్ల యేం జరిగిందో .. అన్నీ ఆయనకు గ్రహింపు ఉండేది. అయినా వారి అవసరం యేంటో తీర్చి పంపేవారు. మరో మాట అనేవారు కాదు. అలాంటి సంతులమైన (balanced) మనస్సు కలిగి ఉండటం అతి కష్టం. ఈ లక్ష్జణం నూరు శాతం నాకు అలవడిందా అంటే లేదనే చెప్పాలి. అయితే మేం నేర్చుకున్నదేమిటంటే అలాంటి వేల్యూస్ ఎప్పుడూ మెయిన్టైన్ చెయ్యాలి అని.

మా బంధువుల పిల్లల పెళ్ళిళ్ళు మా బంగళాలోనే జరిగేవి. మా ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళకి పని చేసినవారు మొహమాటంలో డబ్బు వద్దనేవారు. అయినా నాన్నగారి వారి కష్టానికి తగిన డబ్బులిచ్చి పంపేవారు. ఎవరి కష్టమూ ఉంచుకోడం ఆయనకిష్టం ఉండేది కాదు.


మా నాన్నగారొక పరిపూర్ణత సాధించిన న్యాయవాది. పైగా ఆయన లేబర్ లాయర్. వారి వారి కష్టాలతో పేద కార్మికులొచ్చేవారు. కోర్టు ఫీజులు అటుంచి, కనీసం నోటు కాగితాలు కూడా ఆయనే తెప్పించి టైపింగులు అవీ చేయించేవారు. వచ్చినవాళ్ళు అనేవాళ్ళు “ఆయ్యా కోర్టు ఫీజులు మా వల్ల కాదు కనీసం స్టేషనరీ ఖర్చు ఇచ్చుకుంటాము” అంటే అది కూడా వద్దనేవారు. తీసుకునేవారు కాదు. వాళ్ళు గెలిచే దాకా వాళ్ళ తరఫున ఉండి ఉచితంగా వాదించి వాళ్ళకు న్యాయం అందించేలా కృషి చేసేవారు. అందుకే అంతా ఆయన్ని దేముడనేవారు. పండగలొస్తే వచ్చి మా ఇంట్లో ఫలానా పండు కాసిందనో, మా తోటలో ఫలానా కూర పండిందనో తెచ్చిచ్చేవారు. మా సంతోషం కొద్దీ తెచ్చామనేవారు.. కాదనద్దనేవారు. దేముడికి పువ్వో, పండో సమర్పించుకోవాలన్న భక్తిభావం వారిది. యేదో గౌరవం కొద్దీ తెచ్చేవారనుకునేవాడిని. కానీఆయన మీద ఉన్న భక్తికి కారణం యేంటో, దాని వెనుక ఎన్ని లోతైన విషయాలున్నాయో కొంత వయసొచ్చాక కానీ తెలియలేదు నాకు. లేని వాడికి సాయం చేస్తే మనకున్నదేదో పోతుందనుకోవద్దనేవారు. అసలే పేదవాళ్ళయితే వాళ్ళదగ్గర ఫీజులు గుంజి వసూలు చెయ్యడం అన్యాయంగా, పాపంగా భావించేవారు. ఆ విషయం జడ్జీలకు కూడా తెలుసు. అందుకే శాస్త్రి గారు టేకప్ చేసిన కేసులో న్యాయం ఉంటుందని భావించేవారు. మానవత్వపు కోణంతో ఆలోచించేవారు. మా నాన్నగారు కూడా కేసంటే నిద్రపోకుండా రాత్రి రెండింటివరకూ మేలుకుని యేవెవో పుస్తకాలు స్టడీ చేస్తూ, నోట్సులు రాసుకుని, ఎన్నో పుస్తకాలు రిఫర్ చేసి, వాటిల్లో పేజి మార్కులు ఉంచుకుని, అవన్నీ ఉదయాన్నే జాగ్రత్తగా మూటకట్టి కోర్టుకి పట్టుకెళ్ళేవారు.వాటిని తిన్నగా జడ్జి ముందు పెట్టేవారు. తను చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పడం, వెంటనే క్షణాల్లో రిఫరెన్సులు చూపించేవారు. దాంతో ఎదుటివాళ్ళు ఇంకో మాట్లాడటానికి ఉండేది కాదు. అలా ఎన్నో కేసులు నెగ్గారాయన.

మచిలీపట్నంలో 57 నుండి ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీకి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఉన్నారు మా నాన్నగారు. బంధువులు మిత్రులు ఎందరో అన్నారు. “ఎందుకు శాస్త్రీ లేబర్ తో నేకెందుకొచ్చింది?. వాళ్ళేం చేస్తారు నీకు డబ్బులు ఇస్తారా? ఎండుకొచ్చినవీ పనులు” అంటే నాన్నగారి సమాధానం ఒక్కటే “వాళ్ళు నన్ను నమ్ముకుని వచ్చారు. పేద వాళ్ళు. వాళ్ళకోసం పని చెయడం నా ధర్మం”.


మొదట్లో లీగల్ అడ్వైజర్ గా ఉన్నప్పటికీ తర్వాత తర్వాత ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ లేబర్ యూనియన్ కి అద్యక్షుడిగా ఎన్నుకోబడ్దారు. క్రమేపీ సినీ వర్కర్స్ యూనియన్, యల్.ఐ.సి., బాంకు ఎంప్లాయీస్ యూనియన్, ఉపాధ్యాయ సంఘాలు, యన్.జీ.వోలు యూనియన్ వీళ్ళందరికీ అధ్యక్షులుగా సేవలందించారు. ఆయన పలుకుబడి జిల్లాలు దాటింది. ఎక్కడెక్కడి వాళ్ళో ఆయనకోసం వస్తున్నారు. ఎక్కడ చూసినా శాస్త్రిగారి పేరు మారుమ్రోగేది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీనుండి ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆఫర్ తెచ్చారెవరో. మా నాన్నగారు మృదువుగా తిరస్కరించారు. నా ఆదర్శం వేరు. వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. నేను చేయగల్గింది చేస్తున్నాను.అది నా బాధ్యత. రాజకీయాల్లో పదవులు చేపట్టి నేను కొత్తగా చేసేది యేమీ ఉండదు. నా సంతృప్తి మేరకు నా పరిధిలోనేను చెయ్యాలనుకున్న పనులు చేస్తున్నాను. ఇది చాలు. రాజకీయాలు తనకిష్టం లేదని తేల్చి చెప్పేసారు. అదేంటండీ మీరు ఎమ్మెల్యేగా నిలబడితే మీకు తప్ప ఎవరికి ఓటేస్తారన్నారు. “క్షమించండి. వాళ్ళు ఓటేస్తే వెయ్యచ్చు. అది వేరే విషయం. అయినా నాకెవరూ ఓటెయ్యక్కర్లేదు. నా కోసం నిలబడతారు వాళ్ళంతా. అది చాలు.” అని చెప్పి పంపేసారు.


ఇదిలా ఉండగా “సరస్వతీ కళా సమితి” అన్న సాంస్కృతిక సంస్థ స్థాపించారు మా నాన్నగారు. ఆ సంస్థకి కార్యదర్శిగా ఉంటూ, అప్పట్లో మచిలీపట్నానికి వచ్చిన కళాకారులకి వసతినిచ్చేవారు. ఆ రోజుల్లోనే మా ఇంట్లో ఎ.సి. ఉండేది. కళాకారులను హోటళ్ళల్లో అరకొర సౌకర్యాలతో ఉంచడం ఆయనకిష్టం ఉండేది కాదు. మా ఇంటికి మహానుభావులైన కళాకారులొచ్చేవారు. శ్రీరంగం గోపాల రత్నం, షేక్ చిన మౌలానా సాహెబ్, మంగళం పల్లి బాలమురళీ కృష్ణ, చిట్టిబాబు, యల్లా వేంకటేస్వర రావు, ద్వారం వేంకటస్వామి నాయుడు గారు, దండమూరి రామ్మోహన రావు గారు, యమ్. యల్. వసంత కుమారి, రమణి ఇలాంటి అతిరథమహారధులెందరో మా ఇంట ఆతిధ్యం స్వీకరించారు. నా చిన్నవయసులోనే ఇలా జరుగడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. నేను వారిని ఆసక్తి గా గమనించేవాడిని. వారెలా సాధన చేసేవారు, కచేరీల్లో ఎటువంటి తరహా దుస్తులు ధరించేవారు, వారికి అక్కడ జరిగే సన్మానాలు, సత్కారాలు, వారిని ఎంతో గొప్పగా చూడటం – ఇవన్నీ చూసిన నాలో పసితనంలోనే ఒక లక్ష్యం యేర్పడింది. ఓహో. కళాకారులకు ఇంత గౌరవం ఉంటుందన్నమాట. పెద్దయ్యాక నేనూ గొప్ప కళారుడినవ్వాలని నిర్ణయించుకున్నాను.        

పాటపై నాలో ఆసక్తి మొదలయ్యింది. నలుగురిలో పాడేవాడిని. అది విని అందరూ అనేవారు. మీవాడికి బాగా పాడుతున్నాడు. సంగీతం నేర్పించండి బాగా వస్తుందనేవారు. స్వరాలు వింటే గుర్తుండిపోయేవి నాకు. నాన్నగారు నన్ను సంగీతం క్లాసులో నేర్పించారు. ఒకపక్క చదువు, మరోపక్క సంగీతంలో రాణించేలా ప్రోత్సహించేవారు. అవకాశం ఉన్నచోట పాడించేవారు. ఇప్పుడు మా యస్.యస్. మ్యూజిక్ అకాడమీ ద్వారా వేలాది చిన్నారులకు సంగీతం నేర్పించడానికి, వారిని ప్రోత్సహించడానికి స్ఫూర్తి అతి చిన్నవయస్సులో మా నాన్నగారు నాకిచ్చిన ప్రోత్సాహమే. ఫలానా చోటకెళ్ళి పాడి రమ్మనేవారు. ఎవరైనా మీ అబ్బాయిని పంపించండి పాడటానికి అని అడిగితే ఎవరికి, ఎక్కడ, ఎలాంటి వాతావరణం అన్నీ తెల్సుకుని మరీ పంపించేవారు. ఎక్కడైనా సరైన వాతావరణం, పద్దతులు లేని చోటకి నన్ను పంపేవారు కాదు. వాళ్ళ మాటలు, అలవాట్లు బాగుండవని నన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. దేవాలయాలు, శాస్త్రీయ సంగీత కచేరీలు, మంచి సందర్భాలు, సభలు, సమావేశాలు, పేరంటం, పెళ్ళి వంటి శుభకార్యాలు ఇలాంటి చోట్లకైతే పంపి పాడించేవారు. మా ఇళ్ళల్లో శుభకార్యాలప్ప్యుడు కూడా సంగీత కచేరీలు యేర్పాటు చేసేవారు. మధ్య మధ్యలో వాయిద్య సహకారంతో కాసేపు నా చేత పాడించేవారు. సంగీతం చెప్పే టీచర్ మా నాన్న గారి గురుంచి మా కుటుంబం గురుంచి ఎంతో ఉదాత్తంగా చెప్పేవారు. మీ నాన్నగారు యెంతో గొప్పవారు. ఆయన ముందు నిలబడాలన్నా మాబోటి వాళ్ళకు భయం అనేవారు. నాకు అపరిమితమైన ఆశ్చర్యం కలిగేది. మాకు టీచరంటే ఎంతో గొప్ప అటువంటిది మానాన్నగారిగురించి అలా చెప్తుంటే ఇంత గౌరవం ఎలా సంపాదించుకున్నారో, ఆయనెంత గొప్పవారో అనుకునేవాడిని. పెద్దయ్యే కొద్దీ అర్ధమైంది నాన్నగారెందుకు అంతగా అందరిచేతా గౌరవింపబడేవారో. ఇలాంటి సంఘటనలన్నీ నాపై చెరగని ముద్ర వేశాయి.

పాటలంటూ చదువులో వెనుకబడ్తున్నానని మా అన్నదమ్ములంటే పర్లేదురా వాడే పికప్ అవుతాడు, వాడినేం అనద్దనేవారు. ప్రొగ్రెస్ రిపోర్ట్ చూపించడానికి భయపడ్డాను. చూసి చిరునవ్వుతో సంతకం పెట్టి ఇచ్చేసరు. కానీ తర్వాత నన్ను మెల్లగా కూర్చోబెట్టి అటు సంగీతంతో బాటు ఇటు చదువులో ఎందుకు రాణించాలో, ఎలా రాణించాలో అర్ధమయ్యేలా. చదువులో పుంజుకున్నాను. ఆయన పాజిటివ్ దృక్పథం అలా ఉందేది.

ఆయన బైటొక లాయరు, ట్రేడ్ యూనియన్ల నాయకుడు. మరొక పక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. కానీ ఇంట్లోకొచ్చేసరికి పూర్తి ఆధ్యాత్మివాదిలా మారిపోయేవారు. లలితా సహస్రనామం, దేవీ ఉపాసన, అమ్మవారి పూజ చేసేవారు. ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలను మా ఇంటికి ఆహ్వానించి సేవించి పంపేవారు. దేవీ నవరాత్రులప్పుడు నేనెక్కడున్నా హారతి సమయంలో వచ్చి అమ్మవారి మీద కీర్తనలు పాడాలి. ఇది రూలు. ఇలా మా ఇంట్లో ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం ఉండేది. సంస్కృతీ సంప్రదాయాల ఆచరణ ఉండేది. అమ్మవారు అంటే మాకందరికీ నమ్మకం, భక్తి విశ్వాసాలు. ఇవన్నీ మా వ్యక్తిత్వాలను ప్రభావితం చేసాయి.


మా నాన్నగారు క్రమశిక్షణకి ప్రాధాన్యతిచ్చేవారు. అంతమాత్రాన నిరంకుశంగా వ్యవహరించేవారు కాదు. కోపంతో విరుచుకుపడేవారు కాదు. ఎప్పుడూ కూల్ టెంపరిమెంట్ మెయిన్టెయిన్ చేసేవారు. కోర్టన‌గానే వాదనలు, ప్రతివాదనలు, వేడెక్కిన వాతావరణం, ఆవేశం, భావోద్వేగాలు, పెద్ద లెక్చర్లు సహజం. అయితే మా నాన్నగారు మాత్రం చెప్పాలనుకున్న పాయింటు కూల్ గా చెప్పేవారు. ఉద్వేగాలకు లోనయ్యేవారు కాదు. తన ఎమోషన్లను తన నియంత్రణలో ఉంచుకునేవారు. అనవసరపు ఆవేశాలకు లోనుకావడం, విషయం పక్కకు వెళ్ళడం అసలు జరిగేది కాదు. జడ్జీలు ఆశ్చర్యపోయేవారు ఆయన ప్రశాంత గంభీర వ్యక్తిత్వాన్ని చూసి. నన్ను అడుగుతూంటారు ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడతారు, కోపం తెచ్చుకున్నట్లు కనిపించరు. అదేంటి ఇంత కూల్‌గా ఎలా ఉండగల్గుతున్నారు అని. నేనప్పుడు స్మరించుకునేది మా నాన్నగారినే.

నాన్నగారు కలెక్టరుగారికి కబురంపేవారు మీతో మాట్లాడటాని రావాలని. వెంటనే సమయమిచ్చేవారు కలెక్టరు గారు. మా నాన్నగారితో వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకిచ్చే గౌరవం, నేరుగా కలెక్టర్ గారిదగ్గరకెళ్ళి మాట్లాడి రావడం ఇవన్నీ చూసేవాడిని. అలాగే యస్.పి.లు, డి.యస్. పి.లు, ప్రముఖ నాయకులు ఇలా ఎవరినైనా కోరుకున్న వెంటనే కలవగలిగే వారు నాన్నగారు. ఇప్పడు ఎంతటి హోదాలో ఉన్నవారితోనైనా యే మాత్రం బెరుకు లేకుండా హుందాగా కావల్సిన పని గురుంచి మాట్లాడి వస్తూంటాను. వారు కూడా నన్నెంతో గౌరవంతో చూసుకుంటారు. చిన్నప్పుడే నాన్నగారినుంది నేర్చుకున్న ఆత్మ విశ్వాసం నాది

ఒకసారి కాలేజీలో గొడవలయ్యి పలువురితో పాటు నన్ను కూడా సస్పెండ్ చేసారు. నాన్నగారిని కాలేజీకి పిలిచారు సంజాయిషీ రాసిస్తే నన్ను తిరిగి చేర్చుకుంటామని. అందరిలా ఆయనకి రాశారు. నాన్నగారు కాలేజీకి వచ్చారు. ఎలా జరిగిందన్నారు. కల్చర్ క్లబ్ సెక్రటరీని కావడంతో గొడవలో పాలుపంచుకోకపోయినా ఆ హోదాలో అక్కడున్నందుకు మీ అబ్బాయిని కూడా సస్పెండ్ చెయ్యాల్సొచ్చిందని లెక్చరర్ చెప్పారు. మీ అంతటివారొచ్చారు మా కాలేజికి. నోటిమాటగా చెప్పి వెళిపోండి చాలు. మీ వాడి సస్పెన్షన్ ఎత్తేస్తామన్నారు. నాన్నగారు ఒప్పుకోలేదు. నన్నడిగారు “కల్చరల్ క్లబ్ కార్యదర్శి పదవిలోంచి తప్పుకుంటావా” అన్నారు. “మీరెలా చెప్తే అలా చేస్తా” అన్నాను. మరో మాట అనలేదు. కావల్సిన కాగితం రాసిచ్చేసి వచ్చేసారు. నన్నాతర్వాత అన్నదీ యేం లేదు.

మా స్నేహితుల్ని ఆయన ఆదరించేవారు. వారికిష్టమైన విషయాలు మాట్లాడేవారు. ఒకళ్ళతో క్రికెట్ మరొకరితో పెయింటింగు, ఇంకోళ్ళతో సంగీతం.. ఇలా వారితో చక్కగా మాట్లాడుతూ వారికి తెలియని విషయాలు కూడా చెప్పేవారు.వాళ్ళల్లో ఒకరిగా కలిసిపోయేవారు. మా స్నేహితులకి కూడా ఇష్టం, గౌరవం మా నాన్నగారంటే. ఇదే విషయాన్ని నా పిల్లల విషయంలో కూడా పాటించాను. నా పిల్లల మిత్రులతో చక్కగా మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు పేరెంటింగ్ పుస్తకాల్లో వస్తున్న చక్కటి పేరెంటింగ్ సూత్రాల్లో ఇదొకటి. మానాన్నగారు ఆనాడే పాటించి చూపారు దీన్ని.

క్రమశిక్షణ అవసరమనేవారు. ఎవ్వరితో వాదించద్దనేవారు. ఎదుటివాళ్ళు యేమన్నా, ఎలాంటివి అన్నా, చెప్పేది నీకు తెల్సినా అడ్డుపడకుండా సాంతం వినమనే వారు. మధ్యలో అడ్డుకుని, వాదింఛి ఎదుటివాళ్ళని హర్ట్ చెయ్యద్దనేవారు. మొత్తం విన్న తర్వాత నీకు తెల్సింది చెప్పు అనేవారు. కూల్ టెంపరిమెంట్ తో ఉండమనేవారు. ప్రతీ చోట మనకి నచ్చే విషయాల్లే ఉండవు. నచ్చినదాన్ని సంతోషంగా స్వీకరించడం గొప్పకాదు. నచ్చని దాన్ని పట్ల ఓర్పు వహించాలనేవారు. వంతెనల మీద, బజార్లలో స్నేహితులతో అనవసరమైన హస్కు వేస్కోద్దని చెప్పేవారు. మిత్రులతో అనవసరమైన మాటలు మాట్లాడాల్సి రావడం వల్ల అవి మనల్ని కూడా ఎలా రాంగ్ ట్రాక్ లోకి తీసుకుపోతాయో చెప్పేవారు. ఆయనకిష్టం లేని విషయాలని కూడా కూల్ గా చెప్పేవారు. మా నాన్నగారిదొక విశిష్ట వ్యక్తిత్వం. ఒక గౌరవమైన వ్యక్తిగా సమాజంలో జీవిస్తున్నా అంటే అది ఆయన ప్రభావమే.
1200 మందికి కార్మికులు పైగా పనిచేసే అంధ్రా సైంటిఫిక్ కంపనీ లేఆఫ్ ప్రకటించి 8 నెలలపాటు మూసేసింది. వీధిన పడ్డ కార్మికుల కోసం ఇల్లిల్లు తిరిగి అన్నవస్త్రాలు పోగు చేసి వారినాదుకున్నారు మా నాన్నగారు. చండ్రరాజేశ్వరరావుగారు, పూర్ణ మల్లికార్జున్ గారు, మాగంటి అంకినీడు గారు వంటి యం.పిలతో డిల్లీ వెళ్ళి మాట్లాడి అప్పటి కార్మిక మంత్రి ఇందిరాగాంధీ వరకు విషయాన్ని తీసుకెళ్ళి అంధ్రా సైంటిఫిక్ కంపనీని జాతీయం చేయించి తిరిగి పనిచేసేలా తీవ్ర కృషి చేసారు. పోరాడి విజయం సాధించారు. కంపెనీ ప్రభుత్వాధ్వర్యంలో తిరిగి ప్రారంభం అయ్యింది. 77 లో ఆ కంపెనీ కార్మికులంతా ఒక్కసారిగా సెంట్రల్ గవర్నమెంటు ఎంప్లాయెస్ అయిపోయారు. వారంతా పండుగలు చేసుకున్నారు. తమకందరికీ అన్నం పెట్టిన మా నాన్నగారిని 78 జనవరి న్యూ యియర్ రోజున ఘనంగా సన్మానించుకోవాలనుకున్నారు కార్మికులు. ఇంతలో 77 నవంబర్ లో దివిసీమ తుఫాను వచ్చింది. ఎంతో మంది చనిపోయారు. అది మా నాన్నగారిని తీవ్రంగా కదిలించింది. విచలితుల్నిచేసింది. మనిషి మారిపోయారు. మౌనంలోకి వెళ్ళిపోయారు. యోగిలా మారిపోయారు. అలా కూర్చునేవారు. యేమైనా అంటే “ఒక్క రాత్రిలో ఎంత మంది జీవితాలు మారిపోయాయి. ఎంత మంది చచ్చిపోయారు. ఎప్పటికి కోలుకుంటారు. కుటుంబాలు యేమయిపోయాయి. లక్షలమంది .. యేం చేస్తే మాత్రం వీళ్ళు బాగుపడతారు.”.. అంటూ బాధపడేవారు. “నాన్నగారూ అది ప్రకృతి వైపరీత్యం ఎవరేం చేస్తారు” అంటే “అదే, ఎంత చేస్తే మాత్రం ఇలాంటిది ఒక్కటొస్తే మన దేశ ప్రజలెలా తట్టుకోగల్గుతారు” అన్నారు . అదే బాధ.. అందులోంచి బయటకి రాలేకపోయారు. మౌనం.. తీవ్ర వేదన.. నవంబర్ 19 న ఉప్పెన.. డిసెంబర్ 21 న మాసివ్ హార్ట్ ఎటాక్ తో మా నాన్నగారి మరణం. డిసెంబర్ 31 న మానాన్నగారి సన్మాన కార్యక్రమల్లా చివరికి ఆయన పదో రోజయ్యింది. మా నాన్నగారి మరణం రోజున మా కుటుంబ సభ్యులదే కాదు, కార్మికుల రోదనల్ని కూడా ఆపడం ఎవరితరమూ కాలేదు. వారి కుటుంబపు పెద్ద దిక్కు కోల్ఫోయినట్లు వేదన చెందారు.2 వేలమందికి పైగా పాల్గొని పెద్ద ఊరేగింపు జరిపారు. పోయింది వాళ్ళ నాన్నగారన్నారు. మీకు చదువు చెప్పించారు మీ నాన్నగారు. మేరెలాగోలాగ బతుకుతారు. కానీ అన్నం పెట్టే నాన్నని కోల్పోయిన మాకు దిక్కెవరంటూ కార్మికులు యేడుస్తుంటే ఎవరినీ ఎవరూ ఓదార్చలేని పరిస్థితి.

ఈ రోజుకి మచిలీపట్నంలోని ఎందరో ఇళ్ళల్లో నాన్నగారి ఫొటోలున్నాయి. దేముడిలా ఇప్పటికీ పూజించుకునేవారున్నారు. యే పేదలకోసం కృషి చేసారో వారికి భుక్తి కల్పించడంతో తన జీవితాశయం నెరవేరిందనుకున్నారేమో వెళిపోయారు ఆయన. మా నాన్నగారు చనిపోయే ముందు సంవత్సరం బల్గేరియా దేశంలో ప్రపంచ ట్రేడ్ యూనియన్ల సదస్సుకి మన తెలుగు ప్రాంత ప్రతినిధిగా పాల్గొని అక్కడ ప్రసంగించారు మా నాన్నగారు. ఆయన మరణించకపోతే తదుపరి రష్యా కూడా వెళ్ళాల్సి ఉండింది. మా నాన్నగారి విగ్రహాన్ని నలు రోడ్ల కూడల్లో ప్రతిష్టిద్దామనుకున్నారు కార్మిక సంఘాల వారు. మునిసిపాలిటీ వాళ్ళు స్థలమెక్కడా ఇవ్వలేకపోయారు. దాంతో డబ్బులు వేసుకుని మా నాన్నగారి పేరుతో “సుబ్బరాయ శాస్త్రి మెమోరియల్ కమ్యూనిటీ హాలు” కట్టారు కార్మికులు. అక్కడ అతి తక్కువ రేటుకి కార్మిక కుటుంబాల్లోని పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు ఇస్తూ ఉంటారు. మా నాన్నగారి పేరిట అలా కూడా కార్మికులకు మంచి జరగడం ఆనందం. ఈ మధ్యనే వెళ్ళాను అక్కడకు.   

ఇటీవల ఒక రోజున రైల్లో ప్రయాణిస్తున్నాను. నా ఎదురుగా కూర్చున్న ఆయన నన్నే గమనిస్తున్నారు. ఆయన వయస్సు సుమారు అరవై ఉండచ్చు. నన్ను చూపిస్తూ తన భార్యతో ఏదో చెప్తున్నారాయన. ఏదో టి.వి.లో పాడుతుండగా నన్ను చూసారేమో అనుకున్నాను. నాదగ్గరకొచ్చి ఏం చేస్తూ ఉంటారన్నారు. నేను పాటలు పాడుతూంటానన్నాను. మీది మచిలీపట్నమా అంటే అవునన్నాను. సుబ్బరాయశాస్త్రి గారు మీకేం అవుతారన్నారు. ఏమవ్వడమేమిటీ ఆయన మా నాన్నగారు అన్నాను. అంతే..  హఠాత్తుగా వంగి ఆయన నా కాళ్ళకు నమస్కారం చేసారు. చాలా ఇబ్బంది పడ్డాను. అయ్యో అదేంటండీ, పెద్దవారు మీరిలా చేయకూడదన్నాను. అప్పుడాయన “అచ్చు మీ నాన్నగారిని చూస్తూన్నట్లుంది. సినిమాలో ఫ్లాష్‌బాక్ లా కాలం వెనక్కి పోయి మీరు మీ నాన్నగారే అన్న భావన కలుగుతోంది. ఆయనలానే ఉన్నారు. దేముడండి ఆయన. ఆయనవల్లే మా కుటుంబం నిలబడింది. అన్నం పెట్టి నిలబెట్టిన మహానుభావుడాయన. నేను ఆంధ్రా సైంటిఫిక్ లో రిటైర్ అయ్యాను. ఆయన ఫొటో మాఇంట్లో దేవుడి ఫొటోల పక్కన ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. నాకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. నానోట మాట రాలేదు. నాన్నగారి ప్రభావం ఎందరి జీవితాలపై ఉందో కదా అన్పించింది. ఆహా! ఎంతటి మనిషి మా నాన్నగారనుకుంటూ ఆయన్ను గురుంచి మరోసారి గర్వపడ్డాను.


మా నాన్నగారి గురుంచి మా పిల్లలతో తరచూ చెప్తూంటాను. నా శ్రీమతి లలితకి, పిల్లలకూ మా నాన్నగారంటే ఎనలేని భక్తి ప్రపత్తులు. ఇప్పటికీ వారి సంస్మరణ కార్యక్రమాల నిర్వహణలో నా భార్య ఎంతో శ్రద్ద చూపిస్తుంది. అంతమందికి అన్నం పెట్టిన వారు మీ నాన్నగారు, ఆయన కార్యక్రమాలను శాస్త్రయుక్తంగా చేసి తీరాలంటుంది. మా నాన్నగారి ప్రభావం మా భవిష్య తరాలపై ఉంటుందనడంలో సందేహం లేదు. నాన్నగారి స్ఫూర్తితో ఎలామెదలాలి, ఎలా ఎదగాలి, విద్య, విద్వత్తుతో బాటు ఎదుటి మనుషుల భావాలకి ఎలా విలువివ్వాలి, అందరిలో ఒకడిలా ఉంటూ తెలియని విషయాలు ఎలా తెల్సుకోవాలి అన్నది తెల్సుకున్నాను. నన్ను చూసి, వాళ్ళ తాతగారిగురుంచి తరచూ నేను చెప్పే విషయాలు నాపిల్లలు శ్రుతి, స్రవంతి ఆసక్తిగా వింటూ ఉంటారు. ఆయా విషయాల ఆచరణ నాలో, నా అన్నదమ్ముల్లో గమనించి నావృత్తి, ప్రవృత్తి పట్ల గౌరవం కనపరుస్తూ వాళ్ళు కూడా ఊహ తెలిసిన తర్వాత నన్ను అనుసరించడం ప్రారంభించారు. మా సంగీతకార్యక్రమాలను చూస్తూ వాటి నిర్వహణ ఎలాగో, ఎంత మంది మధ్యలో ఉన్నా నవ్వుతూ అందరినీ ఎలా పలకరించాలో, వేదికపై ఎలా పాడాలో శ్రద్దగా అందుకు ఎలాంటి సాధన చేయాలో పరిశీలించేవారు. మన ఇంట్లో ఉన్నదే విద్య అని అనుకోకుండా నా దగ్గర నేర్చుకోడంతో పాటు మహాగాయకులు బాలకృష్ణప్రసాద్, బాలమురళీ కృష్ణ డి.వి. మోహనకృష్ణ వద్ద కూడా సంగీతంలో మెళకువలు నేర్చుకుంది మా అమ్మాయి శ్రుతి. తను కూడా ఇక్కడ కచేరీల్లో పాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. మరో పక్క చదువులో కూడా శ్రద్ద పెడుతూ బి.టెక్. చేసి యమ్.యస్. చేయడం కోసం అమెరికాలో ఉంటోంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో అక్కడి తెలుగు సంఘాలు చేస్తున్న కృషిలో తనూ పాలుపంచుకుంటోంది. మా అమ్మాయిగా తెలిసిన తెలుగు సంఘాలవారు తనని గాయనిగా ప్రోత్సహిస్తున్నారు. మొన్నీమధ్యనే న్యూజెర్సీ తెలుగు అసోసియేషన్ నన్ను పిలిచి ప్రత్యేక కచేరీ నిర్వహించారు. అందులో నాతో పాటు మా అమ్మాయి కూడా పాడింది. అక్కడ నాలుగు వేలమందికి పైగా తెలుగువారి ముందు పాడి ప్రశంసలు పొందింది. తల్లితండ్రుల మనకు వారసత్వంగా అందించిన సంప్రదాయాన్నిఆచరిస్తూవాళ్ళ ఉనికిని తెలియచేస్తూ మన ముందు తరం వాళ్ళకి ఆచరించమని చెప్పడానికి మా నాన్నగారే స్ఫూర్తి. అంటే మా కుటుంబంలో మూడో తరాన్ని కూడా ప్రభావితం చేస్తున్న గొప్ప వ్యక్తిత్వం మా నాన్నగారిది. మా రెండో అమ్మాయి స్రవంతి తన తాతగారి తాతగారి వరకూ మా పూర్వీకుల విషయాలను క్రోడీకరించి వాటిని పుస్తకరూపంలో తేవాలనుకోవడం విశేషం.

           మా ఉన్నతికి ప్రోత్సాహాన్నిచ్చి, ఇతరులు ఆదర్శాలుగా చెప్పేవాటిని ఆచరణలో చూపి మా జీవితాలపై చెరగని ముద్ర వేసి, మమ్మల్నింతవారిగా చేయడమే కాక ఇప్పటి మా దైనందిక జీవిత విషయాల్లో సైతం అను నిత్యం స్ఫూర్తినిచ్చే మానాన్నగారంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. ఆయనొక కర్మయోగి. భగవద్గీత ప్రభోధించిన “స్తిత ప్రజ్ఞత”కు ఆచరణ రూపం ఆయన జీవితమే. మళ్ళీ జన్మలో కూడా ఆయన్నే మా నాన్నగారిగా ప్రసాదించాలని మా ఇంటి ఇలవేలుపు వేంకటేశ్వరస్వామిని, అమ్మవారిని ప్రార్ధిస్తున్నాను.

      

Leave a Reply