అంబికా అనంత్ గారు–మచిలీపట్నం

0
445

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు. పదిహేనో శతాబ్దపు అచ్చతెలుగు పాలతాలికలు అన్నమయ్య కీర్తనలు. వాటిని ఆంగ్లంలోకి అనువదించాలంటే ఎంతటివారైనా అసిధారావ్రతం చేయాల్సిందే. దాన్ని అలవోకగా పూర్తిచేసి, ‘సంగీత కళానిధి’ డా।। నేదునూరి కృష్ణమూర్తి లాంటి ఉద్దండుల ప్రశంసలు అందుకున్నారు అంబికా అనంత్‌. అంతేనా! వీరశైవ బసవేశ్వరుడి వచనాలను కన్నడంలోంచి తెలుగులోకి తెచ్చారు. పాకిస్థానీ స్త్రీవాద కవయిత్రుల గళాలనూ మన పాఠకులకు వినిపించారు. ఇలా అనువాద ప్రక్రియలో విశేష కృషి చేస్తూనే.. కథారచయిత్రిగా, కవయిత్రిగా రాణిస్తున్న అంబికతో ‘తెలుగు వెలుగు’ మాట్లాడింది. ఆ విశేషాలు ఆవిడ మాటల్లోనే…
మొదటిసారి నేను అన్నమాచార్య సంకీర్తనలను అనువదించింది, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద విభాగం ‘శబ్దన’ నిర్వహించిన ఓ కార్యశాలలో. అనువాద ప్రక్రియలో మెలకువల్ని వివిధ భాషల అనువాదకులు పరస్పరం అవగాహన చేసుకోవడానికి ఉద్దేశించిన కార్యశాల అది. అక్కడ అన్నమయ్య కీర్తనలతో పాటు.. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలు అరవైకు పైగా అనువదించే సదవకాశం కలిగింది. ఆ స్ఫూర్తి, అనుభవంతో.. నేనూ, నా సహ అనువాదకులు డా।। అద్వితీయ దీక్షిత్‌, మచ్చుకు కొన్ని అన్నమయ్య కీర్తనలను అనువదించి, తి.తి.దే.కు పంపించాం. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా।। మేడసాని మోహన్‌ వెంటనే స్పందించారు. ఆంగ్లానువాదం ద్వారా అన్నమాచార్య సంకీర్తనల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అప్పటికే తి.తి.దే. సంకల్పించినట్టు చెప్పి, దానికి మా అనువాదం చాలా ఉపయుక్తమవుతుందని అన్నారు. అలా అన్నమాచార్య జీవిత చరిత్రను, 280 సంకీర్తనలను ఆంగ్లంలోకి అనువదించి సమర్పించాం. అప్పటి ఈఓ అజయ్‌ కల్లాం ఆధ్వర్యంలో అతి తక్కువ సమయంలో మా అనువాదాన్ని ‘నెక్టార్‌ ఓషన్‌ ఆఫ్‌ అన్నమాచార్య’ అనే పుస్తకంగా ముద్రించారు. అది మూడు ముద్రణలు పొందింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బర్కిలీ, అమెరికా), యూఎస్‌ కాంగ్రెస్‌ గ్రంథాలయాల్లో సంప్రదింపు గ్రంథంగా ఎంపికైంది.
అన్నమయ్య సంకీర్తనల్లోని భావాల్ని, అర్థాల్ని మేం తొంభై శాతం ఆంగ్లంలోకి తీసుకెళ్లగలిగాం. అయితే, భాషా సౌందర్యాన్ని- జాతీయాలు, నుడికారాలు, సామెతలు – వీటిని తెలుగు నుంచి ఆంగ్లంలోకి తీసుకెళ్లడం అసాధ్యం. సామాన్యంగా అందరి అభిప్రాయం ప్రకారం, ఒక భాషలోని పదానికి వేరొక భాషలో సమానమైన పదం ఉండి తీరుతుంది. కానీ, అది నిజం కాదు. ఉదాహరణకు అన్నమయ్య వాడిన ఓ చిన్నపదం ‘కమలాప్తకుల’కు ఆంగ్లంలో సమానమైన మాట లేదు. దాని అర్థాన్ని వివరించినా ఎంతో పెద్ద వాక్యం అవుతుంది.. ‘ద వన్‌ హూ ఈజ్‌ బోర్న్‌ ఇన్‌ ది క్లాన్‌ ఆఫ్‌ ది వన్‌ హూ ఈజ్‌ డియర్‌ టూ ది లోటస్‌’ అంటూ! అందుకే మేం ‘ఆఫ్‌ సన్‌ క్లాన్‌’ అనే పదం వాడి అనువాదంలో ఒక అందం, పొంతన తీసుకొచ్చాం. అన్నమయ్య ‘కమల’, ‘అరవింద’, ‘పద్మ’, ‘జలజ’, ‘సరసిజ’ అని ఎంతో ముచ్చటగా వాడినా, మేం ఆంగ్లంలో కేవలం ‘లోటస్‌’ అని వాడాల్సి వచ్చింది. మూలభాషలో ఆయా పదాలకున్న విశిష్టార్థాలను తెలుసుకుని, చరిత్రలో, కాలగతిలో పదరూపంలో వచ్చిన మార్పులను అవగతం చేసుకుని మేం ఈ అనువాదాన్ని చేపట్టాం. అన్నమయ్య జీవిత చరిత్రను ఆయన మనవడు తాళ్లపాక తిరువేంగళనాథ రచించిన ద్విపద కావ్యం ఆధారంగా ఆంగ్లంలోకి తీసుకెళ్లాం.
మర్చిపోలేని అనుభూతి
అన్నమయ్య చేసిన ‘సంకీర్తన సేవ’.. శ్రీవేంకటేశ్వరుణ్ని రసబంధురంగా ఆరాధించిన విధానం అసామాన్యం, అనన్యం. ఆ పదకవితా పితామహుడి రచనలను ఆంగ్లంలోకి అనువదించటానికి ఎంత కసరత్తు అవసరమో అంతా చేశాం. పదిహేనో శతాబ్దపు భాషను పూర్తిగా అర్థం చేసుకోవడం కొంచం కష్టమే. ఇక అనువాదమంటే.. ‘ఈతకు మించిన లోతు’ల్లోకి వెళ్లడమే. నా సహ అనువాదకులు డా।। అద్వితీయ దీక్షిత్‌, వృత్తిపరంగా వైద్యులు. పరమ వైష్ణవుడైన ఆయనకు వైష్ణవ సిద్ధాంతం, రామానుజా చార్యుల ప్రబోధనల మీద చాలా పట్టుంది. మా ఇద్దరికీ అన్నమాచార్యుల మీద ఉన్న భక్తి ప్రపత్తులే మాకు దారిదీపాలయ్యాయి. ఈ క్రమంలో ఎందరో మహాపండితులు మాకు అండగా నిలిచారు. వాళ్లలో ముఖ్యులు డా।। మేడసాని మోహన్‌, డా।। వేటూరి ఆనందశాయి. అనువాద సమయంలో కలిగిన ఇబ్బందులను అధిగమించడానికి డా।। వి.ఎ.కె.రంగారావు, డా।। తంగిరాల సుబ్బారావు, డా।। సర్వోత్తమరావు, డా।। వాణి, బాలకృష్ణ ప్రసాద్‌, మల్లాది జయశ్రీల సహాయ సహకారాలు తోడ్పడ్డాయి.
మా పుస్తకాన్ని చదివి, ‘సంగీత కళానిధి డా।। నేదునూరి కృష్ణమూర్తి అభినందించారు. ఆయన స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనల్లో నూట ఎనిమిదింటిని నాతో ఆంగ్లంలోకి అనువదింపజేశారు. వాటిని ‘ఏంబ్రోసియా’ పేరిట ముద్రించారు. ప్రపంచం నలుమూలలా ఉన్న తమ సంగీత విద్యార్థులకు, సంగీత ప్రియులకు అన్నమయ్య కీర్తనల భావాన్ని తెలియచేయడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని ఆశీర్వదించి మెచ్చుకున్నారాయన. అదో మధురానుభూతి.

నాన్న స్ఫూర్తితో..
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించారు అంబిక. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత అనంతపురం, హైదరాబాదుల్లో చదువుకున్నారు. ఎంఈడీ పట్టభద్రులయ్యారు. పాత్రికేయంలో పీజీ డిప్లొమో చేశారు. వివాహానంతరం బెంగళూరులో స్థిరపడ్డారు. భర్త అనంత్‌.. ఇంజనీరు, వ్యాపారవేత్త. అంబిక తండ్రి వణుకూరు నారాయణరావు ఐఏఎస్‌ అధికారి. మాతృభూమి, మాతృభాషలు మాతృమూర్తితో సమానమని ఆయన చెప్పేవారు. కవితలూ రాసేవారు. ఆయన స్ఫూర్తితోనే అంబిక తెలుగు మీద ఇష్టం పెంచుకున్నారు. పద్నాలుగో ఏట తొలి కవిత రాశారు. అది ఓ పత్రికలో ప్రచురితమవడంతో, ఆ ఉత్సాహంతో రచనలు కొనసాగించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఎనిమిదికి పైగా పుస్తకాలను ప్రచురించిన అంబిక.. వివిధ ఆంగ్ల పత్రికల్లో అనేక వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాశారు. ‘కొడిగట్టరాని చిరుదీపాలు, సెలక్షన్‌, సమత, నీటి మీద నడక’ తదితర కథలు ఆవిడకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. వీటిలో ‘సెలక్షన్‌, సమత’లకు వివిధ పోటీల్లో ప్రథమ బహుమతులూ లభించాయి. అనువాద రచనలకు ఇచ్చే మైఖేల్‌ మధుసూదన్‌ దత్‌ పురస్కారంతో పాటు అనేక గౌరవాలను అందుకున్నారు

అనువాదాలే సేతువులు
అన్నమయ్య సంకీర్తనలకు, కైవారం యోగి నారాయణ యతీంద్రుల కీర్తనలకు ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి. వాటిలో తొలివరసలో నిలిచేవి వారి అనన్య భక్తి ప్రపత్తులు! వారిద్దరి ఆరాధ్యదైవం శ్రీమహావిష్ణువు. అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుడి రూపంలో, నారాయణ యతీంద్రులు అమరనారాయణ స్వామి రూపంలో ఆ దేవదేవుణ్ని కొలుచుకున్నారు. ఇద్దరూ సాంఘిక దురాచారాల్ని ఖండించారు. ‘బ్రహ్మమొక్కటే’ అని నినదించారు. వీరిలో నారాయణ యతీంద్రుల కీర్తనలు కర్ణాటకలో భజన పద్ధతిలో చాలా ప్రాచుర్యం పొందాయి. వారణాసి వినయ్‌ తోడ్పాటుతో వాటిని ‘ఎటర్నల్‌ ఎలిక్సిర్‌’ పేరిట ఆంగ్లంలోకి అనువదించాను. అలాగే, నలభైమూడు పద్యాలున్న నారాయణ యతీంద్రుల ‘కాలజ్ఞానం’ కూడా ఓ విశిష్ట రచన. ఇందులో జ్ఞాన, భక్తి, వైరాగ్య విషయాలే కాకుండా సామాజిక, రాజకీయ విషయాలను కూడా ఆయన విశదీకరించారు. ఏ కాలానికైనా ధర్మమే మనకు రక్షణ కవచమని, మానవత్వమే అవసరమైన ధర్మమని నిర్ధరించారు. కైవారం యోగి నారాయణ ట్రస్టు ధర్మాధికారి డా।। ఎమ్‌.ఆర్‌.జయరాం సూచన మేరకు ఈ కాలజ్ఞానాన్ని కూడా ఆంగ్లంలోకి అనువదించే బాధ్యతలను తీసుకున్నాను.
అనువాదమంటే ఓ పునర్నిర్మాణం. మనస్ఫూర్తిగా చేయాల్సిన ప్రక్రియ. మూలరచనలోని అందం ఏమాత్రం దెబ్బ తినకుండా అనువాదం చేయడం కత్తిమీదసామే! అయితే, సాహిత్య పిపాస అనేది రచయితను ఎంతటి కఠిన సవాలుకైనా వెనుకంజ వేయనీయదు. గతంలో అనువాదం అనగానే… ఎవరి రచననో తర్జుమా చేయటం సృజనాత్మకత కాదని కొందరు, ఇందులో గొప్పేంటని మరికొందరు తేలిగ్గా తీసిపారేసేవారు. కానీ, దీనిలోని గొప్పతనాన్ని ప్రస్తుత తరం బాగా అర్థం చేసుకుంది. అందుకే దీన్ని అనువాద యుగం అనవచ్చు. విభిన్న జాతుల మధ్య సాహిత్య, సాంస్కృతిక వినిమయాలకు అనువాదాలే సేతువులు. అందుకే నాకు అనువాదమంటే అంత ఆసక్తి.
బసవన్న సమగ్ర వచనాలను తెలుగులోకి అనువదించాలని ‘బసవ సమితి’ సంస్థ వారు కోరారు. నేనూ, డా।। రాజేశ్వరీ దివాకర్ల కలిసి అనువదించాం. దాన్ని జోళదరాశి చంద్రశేఖరరెడ్డి పరిష్కరించారు. ఆ అనువాద సమయంలో నాకు కన్నడ అధ్యాపకురాలు అనంతలక్ష్మి బాగా సహకరించారు. కన్నడ వ్యావహారిక భాషకు, పన్నెండో శతాబ్ది నాటి గ్రాంథిక భాషకు చాలా తేడా ఉంటుంది. అందులోనూ వీరశైవ సంప్రదాయానికి సంబంధించిన ఆ వచనాలను పైపైన చదివి, అంతర్గత సందేశాలను తెలుసుకోకపోతే అనువాదం పట్టుతప్పిపోతుంది. అందుకే ఆమేరకు జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ పుస్తకం ‘బసవన్న సమగ్ర వచనాలుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ జరుపుకొంది. ఇక పాకిస్థానీ స్త్రీవాద ఉర్దూ కవితలు ఆంగ్లంలో ‘ఉయ్‌ ది సిన్‌ఫుల్‌ ఉమెన్‌’గా సంకలనమయ్యాయి. డా।। తంగిరాల వెలువరించే ‘చైతన్య కవిత’ అనే పత్రిక కోసం వాటిని ‘మేము పాపిష్టి ఆడవాళ్లం’ పేరిట అనువదించాను. దానికీ మంచి స్పందన వచ్చింది.
అలాంటి కథలంటే ఇష్టం
పందొమ్మిదో ఏట రాసిన ‘శిశిర జీవితాలు’ అనే కథ ‘ఆంధ్రపత్రిక’లో అచ్చయ్యింది. పాఠకుల నుంచి చాలా ఉత్తరాలు వచ్చాయి. ఆ స్ఫూర్తితో అడపాదడపా కథలు రాస్తూ వచ్చా. అవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ కథలతో ‘మంచు ముత్యాలు’ పేరిట ఓ సంపుటిని తీసుకొచ్చాను. దాన్ని సుజాతా గోపాల్‌ ఆంగ్లంలోకి అనువదించారు. ఈ సంపుటి మీద ఎంఫిల్‌ స్థాయిలో పరిశోధన జరగడమూ మర్చిపోలేని అనుభవమే.
కథలు వాస్తవానికి దర్పణం పట్టాలి. పాఠకుల మీద మంచి ప్రభావాన్ని చూపాలి. కథా వస్తువుని మనసుతో మలచి, కథాశిల్పాన్ని మెదడుతో నడిపిస్తే మంచి కథ ఆవిష్కృతమవుతుంది. మానవీయ విలువల్ని, సంబంధాలను వివరించే సంఘటనల్ని, పాత్రలను చిత్రీకరించడం నా శైలి. అలాగే.. సాఫీగా సాగిపోయే భాషలో, భావాన్ని ప్రస్ఫుటంగా చెబుతూ కవితలు రాయడమన్నా నాకు ఇష్టమే. ‘‘ఎముకల పోగులోని కిర్రుబుర్రు కంజీరాల్లో/ వేదన రోదన జుగల్‌ బందీలలో/ అష్టకష్టాలే అష్టపదులైన/ జీవన సంగ్రామ సంగీతమే నీ జీవితం!’’ అంటూ యాచకుడి మీద రాసిన కవితతో పాటు మరికొన్ని కలిపి ‘వెలుగు రెక్కలు’ పేరిట సంపుటిగా వచ్చాయి. ‘ఆకాశమంత’ పేరిట మరో కవితాసంపుటిని కూడా ప్రచురించాను. అబ్బూరి ఛాయాదేవి, మధురాంతకం రాజారాం, డా।। అంపశయ్య నవీన్‌, కాశీభొట్ల వేణుగోపాల్‌, డి.కామేశ్వరి తదితరులు నాకు ఇష్టమైన సాహిత్యకారులు.
సాహితీ సహచరులం.. డా।। భార్గవీరావు, జీఎస్పీ రావు, ప్రొ. టి.విజయ్‌కుమార్‌, నేను కలిసి ‘మ్యూజ్‌ఇండియా.కాం’ను 2005లో ప్రారంభించాం. భారతీయ సాహిత్యానికి అంకితమైన తొలి అంతర్జాల పత్రిక ఇది. దేశంలోని వివిధ భాషల సాహితీరంగాల్లో జరుగుతున్న కృషి, వస్తున్న మార్పులు, కొత్తరచనలు తదితరాలను ఆంగ్లానువాదాలతో అందించడం మ్యూజ్‌ ఇండియా ప్రత్యేకత. రాయడంతో పాటు ఇలా సాహితీసేవ చేయడం నాకు సంతృప్తిని కలిగిస్తుంటుంది. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలనేది నా ఆకాంక్ష.

Leave a Reply